దివ్యాంగ ఉద్యోగినిపై దాడి.. దిశ చ‌ట్టం ఎక్క‌డ జగన్ గారు?

నెల్లూరులో దారుణమైన ఘటన జరిగింది. మాస్క్ పెట్టుకోమని చెప్పినందుకు ఉద్యోగినిపై రాడ్ తో దాడి చేశాడు ఓ అధికారి. ఈ అమానుష ఘటన నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో చోటుచేసుకుంది. ఉషారాణి అనే ఆమె ఏపీ టూరిజం కార్యాలయంలో ఒక ఉద్యోగిని. పైగా దివ్యాంగురాలు. కరోనా విలయతాండవం నేపథ్యంలో బాధ్యత గల ఓ పౌరురాలిగా అందరూ మాస్క్‌లు ధరించండని సూచించింది. ఈ విషయం డిప్యూటీ మేనేజర్ భాస్కర రావుకు రుచించలేదు. నాకే చెబుతావా అంటూ ఆగ్రహంతో రగిలిపోతూ ఆమెపై దాడికి తెగబడ్డాడు. సహచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, దివ్యాంగురాలన్న కనికరం కూడా లేకుండా విచాక్షణరహితంగా చావబాదాడు.

దివ్యాంగ ఉద్యోగినిపై దాడి ఘటనపై ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ సీరియస్ అయ్యారు. డిప్యూటీ మేనేజర్‌ భాస్కర రావు‌ను సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు భాస్కర రావు‌ని సస్పెండ్ చేస్తూ ఏపీ టూరిజం శాఖ ఎండీ ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, భాస్కర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "మానవ మృగాలు రెచ్చిపోతుంటే బాధితుల‌కు 21 రోజుల్లో న్యాయం చేసేందుకు తెచ్చిన దిశ చ‌ట్టం ఎక్క‌డ వైఎస్ జగన్ గారు?. పాల‌కులే ప్ర‌తీకారంతో చెలరేగిపోతుంటే కొంద‌రు  అధికారులు అదే పంథాలో అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నెల్లూరు ఏపీ టూరిజం కార్యాలయంలో మాస్కు పెట్టుకోమన్న దివ్యాంగురాలైన ఓ మ‌హిళా ఉద్యోగిని అత్యంత దారుణంగా హింసించిన‌ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ని స‌స్పెండ్ చేసి చేతులు దులుపుకోవ‌టం కాదు. క‌ఠినంగా శిక్షించాలి." అని లోకేష్ డిమాండ్ చేశారు.