మండలి రద్దు... వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టిన వైఎస్ జగన్

మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకుగానూ ఒక తీర్మానం కూడా ఆమోదించిందని సమాచారం. కాసేపట్లో అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ  జరగనుంది. 2007, ఏప్రిల్ 22న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మండలిని పునరుద్ధరించారు. 2007 నుంచి మళ్లీ దాదాపు 12 ఏళ్ల పాటు సజావుగా సాగుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న మండలికి నేడు ప్రభుత్వం అధికారికంగా రద్దు ముద్ర వేయనుంది. ఈ తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందితే చివరిగా దానిని కేంద్రానికి పంపుతారు. కేంద్రం కూడా ఆమోద ముద్ర వేస్తే మొత్తానికి ఏపీలో శాసనమండలి పూర్తిగా రద్దవుతుంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో శాసన సభ మండలి ఏర్పాటైన తర్వాత రద్దు కావడం.. మళ్లీ పునఃరుద్ధించటం అనేది కేవలం ఏపీలో మాత్రమే జరిగినట్లు సమాచారం.

తమిళనాడులో ఎంజి రామచంద్రన్ అధికారంలో ఉండగా ఇలాంటి ప్రయత్నమే చేశారు. అయితే కరుణానిధి హయాంలో శాసన మండలి సభ్యత్వానికి చేసిన కేంద్ర ప్రభుత్వం ఆమోద పొందలేదు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉంది. ఏపీకి కూడా శాసన మండలి వద్దని జగన్ తీర్మాణాలు చేయించి రాష్ట్రపతి అనుమతితో మండలి గనుక రద్దు అయితే దేశంలో ఐదు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉనికిలో ఉంటుంది. అయితే శాసనమండలి రద్దు అవ్వడంతో రాజకీయంగా వైసీపీ లాభనష్టాలను చూస్తే.. కొద్ది రోజుల్లో రిటైర్ అయ్యే వాళ్ళ కారణంగా 17 సీట్లు ఖాళీ అవ్వనున్నాయి. ఇక తన ఎమ్మెల్యేల బలంతో 17 ఎమ్మెల్సీ సీట్లు కైవసం చేసుకొని తన పార్టీ బలాన్ని పెంచుకునే అవకాశం ఉన్నా కూడా జగన్ ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. తమ సొంత పార్టీ సభ్యులు సైతం ఇలాంటి నిర్ణయం తీసుకొవద్దని సూచిస్తున్నా జగన్ మండలి రద్దు పైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీలో దీని పై ఏ నిర్ణయం తీసుకోనున్నారనే అంశం ఉత్కంఠత రేపుతుంది.