ఏపీ ఇసుక వెబ్ సైట్ హ్యాక్ .. ఇసుక కొరత బ్లూఫ్రాగ్ సంస్థ వల్లనేనా?

 

డంపింగ్ యార్డుల్లో ఇసుక ఉంది. కానీ ప్రభుత్వ వెబ్ సైట్ లో మాత్రం ఇసుక లేదు. కృత్రిమ ఇసుక కొరతకు బ్లూఫ్రాగ్ సంస్థ కారణమా ? బ్లూఫ్రాగ్ సంస్థ వెనుక ఎవరైనా ఉన్నారా? వీటిని వెలికి తీసే పనిలో ఉంది సిఐడి. ఇసుక సరఫరా పారదర్శకంగా జరగాలని ఏపీ సర్కారు ప్రయత్నిస్తుంది. అక్రమ మార్గాలు అనుసరిస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇసుక కొరత వల్ల లక్షల మంది ఎదుర్కుంటున్న ఇబ్బందుల పై గురి పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ఈ సమయంలో వెబ్ సైట్ హ్యాకింగ్ ద్వారా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్న వ్యవహారం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. 

వరదల ప్రభావంతో డిమాండ్ కు సరిపడా ఇసుక సరఫరా జరగటం లేదని ప్రభుత్వం అంగీకరిస్తోంది. అదే సమయంలో యార్డుల్లో ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ ఆన్ లైన్ పోర్టల్ లోకి ఎందుకు లభ్యం కావడం లేదని డౌట్ ఆధారంగా సీఐడీ దర్యాప్తు మొదలెట్టింది. బ్లూఫ్రాగ్ పై వరుస ఫిర్యాదులు అందుకున్న సీఐడీ ఏక కాలంలో సంస్థలపై దాడులు జరిపింది. డేటా స్టోర్ చేసే విభాగాలనూ తెరిచి కీలకమైన సమాచారం సేకరించారు. అదే విధంగా బ్లూఫ్రాగ్ సంస్థ ఐదారేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందన్న సమాచారాన్ని సీఐడీ రాబట్టింది. ఇసుక కృత్రిమ కొరత వెనుకున్న మాయాజాలం బయటపెట్టేందుకు బ్లూఫ్రాగ్ సంస్థల్లో సేకరించిన డేటాను ఐటీ సైబర్ క్రైం విభాగాలతో విశ్లేషించనున్నాయి. సంస్థ నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే వాస్తవాలు తెలుస్తాయంటున్నారు సీఐడీ అధికారులు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి.. వ్యవసాయ రంగాలకు సంబంధించిన డేటా సేకరణ క్రోడీకరణ బ్లూఫ్రాగ్ సంస్థల్లో జరుగుతోంది. కంపెనీ సర్వర్ లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సీఐడీ అధికారులు సేకరించారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా మరింత లోతుగా విచారణ చేపట్టనుంది సీఐడీ. కృత్రిమ ఇసుక కొరత వెనుక బ్లూఫ్రాగ్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నప్పటికీ విచారణ తర్వాతే వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.