ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 సిద్దం

 

ఈ రోజు కేంద్రమంత్రి మరియు కేంద్రమంత్రుల బృందంలో సభ్యుడు అయిన జైరాం రమేష్ 69పేజీలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013(జీ.ఓ.యం. నివేదిక)ను దాదాపు సిద్దం చేసినట్లు సమాచారం. దానిని మంగళవారం నాడు జరుగబోయే కేంద్రమంత్రుల బృందం సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఆయన సిద్దం చేసిన నివేదికలో ప్రస్తుతం తెరపైకి వచ్చిన రాయల తెలంగాణాను ప్రతిపాదించారా లేక ముందు అనుకోన్నట్లుగానే ఆంధ్ర, తెలంగాణాలనే ప్రతిపాదించారా? అనే అంశం రేపు జరిగే తుది సమావేశం తరువాతనే తెలియవచ్చును. హైదరాబాద్ అంశం కూడా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

 

ఈనెల 5నుండి 20వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగబోతున్నందున, కేంద్రమంత్రి కమల్ నాథ్ సోమవారం నాడు డిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ కుదరకపోతే సభ్యుల కోరిక మేరకు సమావేశాలు పొడిగించే అవకాశం ఉందని అన్నారు.

 

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా రాయల తెలంగాణా ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలిపారు. అయితే దానిని వ్యతిరేఖిస్తున్నానని అన్నారు. బిల్లు తుది దశకు చేరుకొంటున్న ఈ తరుణంలో అటువంటి ప్రతిపాదనల వల్ల ఎవరికీ లాభం లేకపోగా కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. అటువంటి ప్రతిపాదనే ఉంటే, దానిని అడ్డుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని అన్నారు.