జగన్ తో చిరంజీవి మీటింగ్... సినీ-రాజకీయ వర్గాల్లో ఆసక్తి... 

 

తన డ్రీమ్ ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి... సినిమా ప్రమోషన్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తూనే, సినీ రాజకీయ ప్రముఖులను కలుస్తూ సైరా సినిమాను చూడాలని కోరుతున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ ని కలిసి... సైరా సినిమాను వీక్షించాలని కోరిన చిరంజీవి...  తమిళిసై ఫ్యామిలీ కోసం ప్రత్యేక షో వేసి చూపించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ కోసం సైరా సినిమా ప్రత్యేక షో వేయాలని మెగాస్టార్ భావిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవనున్న చిరంజీవి... సైరా సినిమాను వీక్షించాలని కోరనున్నారు. అలాగే, సైరా సినిమా ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు.

అయితే, జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఒకవైపు తమ్ముడు పవన్ కల్యాణ్... జగన్ కు రాజకీయ ప్రత్యర్ధిగా ఉండటం, అలాగే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో... వీరిద్దరి భేటీ ఆసక్తిరేపుతోంది. అయితే, జగన్ అండ్ చిరు మధ్య పెద్దగా సత్సంధాలైతే లేవని అంటారు. ఎందుకంటే, వైఎస్ మరణం తర్వాత... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్.... అప్పట్లో 18మంది ఎమ్మెల్యేలున్న చిరంజీవి మద్దతు కోరారని, అందుకు మెగాస్టార్ ఒప్పుకోలేదని, పైగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారని అంటారు. దాంతో అప్పట్నుంచి చిరంజీవితో జగన్ దూరం మెయింటైన్ చేస్తూ వచ్చారని చెబుతారు. మరోవైపు, జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి వైపు నుంచి కూడా పెద్దగా సత్సంధాలు లేకపోయినప్పటికీ, కేవలం సైరా సినిమా ప్రమోషన్, అలాగే జగన్ ఫ్యామిలీకి సినిమాను చూపించాలనే ఉద్దేశంతోనే కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్-చిరంజీవి భేటీ అటు రాజకీయ వర్గాల్లో... ఇటు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.