ఏపీలో 'ఆంధ్ర రాష్ట్ర సమితి' పార్టీ ఏర్పాటు?

 

తెలంగాణలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అయితే టీఆర్ఎస్ విజయం సాధించినందుకు తెలంగాణలో టీఆర్ఎస్ శ్రేణులు ఎంతలా సంబరాలు చేసుకున్నారో.. ఏపీలో కూడా కొందరు అలాగే సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలో టీఆర్ఎస్ ఏపీలో కూడా అడుగుపెట్టేలా ఉంది. గతంలో కేటీఆర్.. ఏపీ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో విజయం అనంతరం కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. ఏపీ ప్రజలు మమ్మల్ని రమ్మని కోరుతున్నారు. వందకి వంద శాతం వస్తామని కూడా కేసీఆర్ స్పష్టం చేసారు. ప్రస్తుతం కొన్ని పరిణామాలు చూస్తుంటే ఏపీలో కొందరు కేసీఆర్ రాకను బలంగా కోరుకుంటున్నారని అర్ధమవుతోంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లాగా ఏపీలో ఆంధ్ర రాష్ట్ర సమితి (ఏఆర్ఎస్) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ గెలుపొందిన నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నంలో వెలమ యువజన సంఘం విజయోత్సవం నిర్వహించింది. పట్టణానికి చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ కిల్లాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు సంఘ సభ్యులు శారదానగర్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీకన్య కూడలి వద్ద గల దుర్గామల్లేశ్వరి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణాలోని కుత్బుల్లాపుర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన కేపీ వివేకానంద తన స్నేహితుడని, ఆయనతో పాటు ఉత్తరాంధ్రలో కుటుంబ మూలాలు వున్న కేసీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో కేసీఆర్‌ను ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తామన్నారు. ఎంతమంది ఏకమైనా ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా కేసీఆర్‌ దేశంలోనే దమ్మున్న రాజకీయ నాయకుడుగా గుర్తింపు పాందారన్నారు. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుకు తమ వంతు కృషిచేస్తామని సత్యనారాయణ అన్నారు.