కరెక్ట్ మొగుడు అశోక్‌బాబు!

 

 AP NGO President Ashok Babu, Ashok Babu, samaikyandhra, telangana state, seemandhra, congress, tdp

 

 

రాష్ట్రాన్ని విభజించడానికి కారణమైన సీమాంధ్ర, తెలంగాణ రాజకీయ నాయకులకు కరెక్ట్ మొగుడు ఎవరయ్యా అని అడిగితే.. ఇంకెవరయ్యా.. ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబే అనొచ్చు. రెండు నెలలపాటు సక్సెస్‌ఫుల్‌గా సీమాంధ్ర ఉద్యోగుల చేత సమ్మె చేయించి, అటు విభజనవాదులతోపాటు ఇటు గోడమీద పిల్లివాటాన్ని ప్రదర్శిస్తున్న సీమాంధ్ర రాజకీయ నాయకులు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచేలా చేశారు.

 

సమ్మెలు, నిరసనలు ఇలా చాలా ప్రశాంతంగా కూడా చేయవచ్చని నిరూపించిన అశోక్‌బాబు అలనాటి సత్యాగ్రహాన్ని గుర్తుకు తెచ్చారు. ఉద్యమం శాంతియుతంగా ఎలా చేయాలో తెలంగాణవాదులు కూడా చూసి నేర్చుకునేలా చేసిన క్రెడిట్ మొత్తం అశోక్‌బాబుది, ఆయన వెనుక ఉన్న ఉద్యోగులదే. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఉద్యమం చేస్తున్నాడన్న అక్కసుతో తెలంగాణవాదులు ఆయన్ని ఉద్దేశించి ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా, మనకి దక్కని క్రెడిట్ అశోక్‌బాబుకి దక్కేస్తోందని కొందరు సీమాంధ్ర నాయకులు ఎంత విషం కక్కినా నిండుకుండలా తొణక్కుండా వున్న  అశోక్‌బాబు అసలు సిసలు స్థితప్రజ్ఞతని ప్రదర్శించారు.



ఉద్యోగుల సమ్మె విరమణను కూడా వ్యూహాత్మకంగా చేసిన అశోక్‌బాబుని ఎక్కడ నెగ్గాలో అనేది మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి అని అంటున్నారు. ఏది మాట్లాడినా ఆచి, తూచి ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడే అశోక్‌బాబుని చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా వుందని విశేషకులు అంటున్నారు. ఎవరు తనను రెచ్చగొట్టేట్టు మాట్లాడినా ఎంతమాత్రం రెచ్చిపోకుండా సంస్కారబద్ధమైన లాంగ్వేజ్‌తో వాతలు పెడుతున్న అశోక్‌బాబుకి అటు సీమాంధ్ర ప్రజల్లో మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల్లో కూడా అభిమానులు పెరుగుతున్నారు.



ఈ మహానుభావుడు తెలంగాణ ప్రకటించిన తర్వాత కాకుండా కాస్తంత ముందుగా రంగంలోకి దిగి వుంటే విభజన సీను ఇంత దూరం వచ్చేదేకాదు. ఏది ఏమైనా సీమాంధ్రలో మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రంలో అశోక్‌బాబు మీద ప్రజల్లో ఎంతో గౌరవం వుంది. ఈ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద వుంది. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ పంచనో చేరకుండా, ఏ రాజకీయ నాయకుడి మోచేతి నీళ్ళో తాగకుండా ప్రజల పక్షాల నిలబడితే రాష్ట్ర చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.