పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచండి!మంత్రి విశ్వరూప్

తీవ్రంగా ప్రబలు తున్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులలో ను పారిశుద్ధ్యాన్ని బాగా మెరుగు పరచాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంత్రి అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి ఇవతల వైపు ఉన్న చింతగుంట చెరువు, హౌసింగ్ బోర్డు కాలనీ, మరియు మెట్ల కాలనీలను సందర్శించి డ్రైనేజ్ వ్యవస్థను, రహదారులను పరిశీలించారు. ముందుగా చింత గుంట చెరువును సందర్శించిన మంత్రి అక్కడి స్థలాన్ని పరిశీలించి 216 హైవే నుండి చింత గుంట చెరువు వరకు సి.సి రోడ్డును వెంటనే వేయవలసిందిగా మునిసిపల్ అధికారులను ఆదేశించారు. 

అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించిన మంత్రి కాలనీ లో మురుగు నీరు వేగం గా ప్రవహించేలా డ్రెయిన్లు వెడల్పును విశాలంగా చేయాలని, ఇప్పటికే ఆమోదం పొందిన సి.సి రహదారులు, డ్రెయిన్లు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే చింత గుంట చెరువులో  పది మందిని, హౌసింగ్ బోర్డు కాలనీ లో పది మందిని శానిటేషన్ వర్కర్లను ఏర్పాటు చేసి పారిశుధ్యా న్ని మెరుగు పరచాలని మునిసిపల్ అధికార్లను మంత్రి ఆదేశించారు. అనంతరం పట్టణంలోని మెట్ల కాలనీని మంత్రి సందర్శించి గతంలో 10 లక్షల రూపాయలతో మంజూరు అయిన డ్రైన్ కు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.