రైతు భరోసా ఇకపై రూ.13,500... రేపటి నుంచి అమలు

 

రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రైతు భరోసా గడువు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే ఆయన నెల రోజుల పాటు ఈ పథకానికి గడువు పెంచారని తెలిపారు. అక్టోబర్ పదిహేను నుంచి రైతు భరోసా ప్రక్రియ ప్రారంభమవుతుంది అని నవంబరు పదిహేను వరకు అర్హత కలిగిన రైతులు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం పెట్టుబడి సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఇప్పటి వరకు ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారుల జాబితాలన్నీ విలేజ్ సెక్రటేరియట్ లో అదే విధంగా ఎమ్మార్వో ఆఫీసుల్లో, ఎండీఓ ఆఫీసు లో, కలెక్టర్ ఆఫీసులో కూడా తప్పకుండా నోటీసు బోర్డుల్లో పెట్టాలని సీఎం గారు ఆదేశించారని అన్నారు. ఇప్పటి వరకు విలేజ్ సెక్రటేరియట్ లో గత రెండు రోజులు నుంచి జాబితాలను ప్రదర్శించడం జరిగిందని, మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తారు అని తెలిపారు. గత ప్రభుత్వం నలభై మూడు లక్షల మంది రైతు కుటుంబాల జాబితాని పిఎం కిసాన్ పథకానికి సమర్పించినట్టుగా లెక్కలున్నాయన్నారు.

అయితే ఇప్పుడు వాటన్నిటినీ సరిచూసినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారం ప్రకారం దాదాపుగా మూడున్నర లక్షల మంది రైతు కుటుంబాలు ఈ ప్రయోజనం పొందటానికి నిబంధల ప్రకారం అనర్హులుగా తేలుతోందని వివరించారు. అర్హత ఉండి ఆరు లక్షల మంది ఈ పథకాల్లో ప్రయోజనం పొందలేకపోయారని కూడా ప్రాథమిక అంచనాల ప్రకారం తేలిందన్నారు. కాబట్టి ఈ డేటా మొత్తాన్ని సవరించి ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూడటం మీ బాధ్యత అని సీఎం గారు ఆదేశించారని తెలిపారు.

గతంలో ఇచ్చిన దానికన్న మిన్నగా ఈ పథకం అమలు చేయమని సీఎం సూచించారన్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు మూడు లక్షల మంది కౌలు రైతులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చెందిన కౌలు రైతులు ఈ పథకాల్లో లబ్ధి పొందబోతున్నారు అని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ రైతు భరోసా అక్టోబర్ లో ప్రారంభమౌతుంది కనుక కౌలురైతులు ఇంకా ఎవరైనా సరే నమోదు చేసుకోలేకపోవటం, సీ.సీ.ఆర్.సి కార్డ్సు పొందలేకపోవడం వంటి ఇబ్బందులుంటే వాటిని నవంబర్ పదిహేను వరకు మరల దరఖాస్తు చేసినా కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఎం చెప్పారన్నారు.