పంతం నెగ్గించుకున్న జగన్... సభలో మండలి రద్దు తీర్మానం....

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జగన్ ప్రభుత్వం.... మండలి రద్దుకే నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ రద్దు ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేయగా... మండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా శాసనసభలో ప్రవేశపెట్టారు. దాంతో, మండలి రద్దు తీర్మానంపై సభలో చర్చ జరుగుతోంది. 

అయితే, మండలి రద్దు నిర్ణయంపై తెలుగుదేశం మండిపడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఏడు నెలల్లో 32 బిల్లులు పంపితే మండలిలో తెలుగుదేశం వ్యతిరేకించలేదన్న టీడీపీ లీడర్లు... ప్రజాభీష్టానికి ప్రజావ్యతిరేకంగా ఉన్నందునే మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నామన్నారు. అయితే, మండలి రద్దు అంటే ప్రజావేదికను కూల్చినంత తేలిక కాదని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేశారు.

మరోవైపు, మండలి రద్దు నిర్ణయంతో ఇద్దరు మంత్రులు త్వరలో మాజీలుగా మారనున్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు.... కౌన్సిల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ జగన్ కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే, శాసనమండలి రద్దు జరిగిన ఆర్నెళ్ల తర్వాత వీళ్లిద్దరూ మాజీలుగా మారిపోతారు. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంచలన నిర్ణయానికి వేదికగా మారింది.