పిసినారి ఐఏఎస్ లు.. రోజువారీ ఖర్చులు కూడా ప్రజాధనం నుండే కావాలి

 

ఐఏఎస్ అంటే అనేక మందికి బాస్. ఆ హోదాకు తగ్గట్లే వారికి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఉండటానికి బంగ్లా.. తిరగటానికి కారు..బయటకు వెళ్తే సకల హంగులతో క్యాంప్ ఆఫీస్.. అన్ని సిద్ధంగా ఉంటాయి. ఇన్ని సదుపాయాలు ఉన్నా.. ఐఏఎస్ లలో చాలా మంది కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోతున్నారు. తమ నివాస భవనాన్ని క్యాంపు కార్యాలయంగా చూపించి ఆ బిల్లును జేబులో వేసుకుంటున్నారు. కరెంటు బిల్లులను తమ సొంత ఆదాయం నుంచి కట్టుకుంటున్న ఐఏఎస్ లను వేళ్ల మీద లెక్కించొచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు కొందరు అర్హతకు మించి వాహనాలను వాడుకుంటున్నారు.రెండు లేదా మూడు ప్రాంతాల్లో వారికి సొంత ఇల్లులు ఉంటున్నాయి. ఆ ఇళ్ళ అద్దె.. నిర్వహణ వ్యయాలు మొత్తం సర్కారు భరించాల్సిన పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన ఆర్ధిక శాఖ లేక పీఏవో శాఖాధికారులే బిల్లు పెట్టడమే ఆలస్యం అన్నట్టుగా చెల్లింపులు చేస్తున్నారు. 

అన్ని శాఖలకు పెద్దన్నలాంటి ఒక శాఖ ఉన్నతాధికారికి నెలకు రూ.25 వేల కరెంటు బిల్లు వస్తుంది. ఆ అధికారి పగలంతా సచివాలయంలో ఉంటారు కానీ ఆయన ఇల్లు కమర్షియల్ జోన్ లో ఉంది. అందుకే ఇంత బిల్లు.. ఈ బిల్లును ప్రజాధనం నుంచే చెల్లిస్తున్నారు. ఇంటి నిర్వహణ, వంట సరుకులు, కూరగాయలకు అవసరమయ్యే డబ్బులు కూడా రోజు వారీగా లేదా అవసరాన్ని బట్టి రెండు మూడు రోజులకొకసారి నగదు రూపంలో తీసుకుంటున్నారు. ఇంట్లో పని వాళ్లకు ఇచ్చే వేతనాలు కూడా ప్రజాధనం నుంచే ఆయన శాఖకు అనుబంధంగా ఉన్న ఒక కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేస్తున్నారు. విజయవాడలో ఇళ్లు.. హైదరాబాద్లో మరో క్వార్టర్ ను ఈ అధికారి వినియోగించుకుంటున్నారు. వైసిపి అధికారంలోకి రాక ముందు ఈ అధికారి వేరే శాఖకు ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు కూడా ఇదే రీతిలో ఇంటి ఖర్చులు పుచ్చుకునేవారు. 

ప్రతి నెలా తమ సొంత ఆదాయం నుంచి కరెంటు బిల్లులు కడుతున్న ఐఎఎస్ లు లేకపోలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం ఒక్క వాహనం, ఒక్క ఇళ్లు మాత్రమే ఉన్న ఐఎఎస్ లు ఉన్నారు. కానీ కొందరికి ఒక వాహనం సరిపోవటం లేదు.. రెండోది కావాల్సిందే. అంతే కాదు మొదటి వాహనం ఎంత ఖరీదైందో ,రెండోది కూడా అంతే ఖరీదైనదిగా విలాసవంతంగా ఉండాలి. ప్రభుత్వం వద్ద సిద్ధంగా లేకపోతే అద్దెకైనా తెచ్చివ్వాలి. కొందరు యువ ఐఎఎస్ ల నుంచి సీనియర్ ఐఏఎస్ ల దాకా ఇలాంటి విషయాల్లో పట్టుదలతో ఉంటున్నారు. నిజానికి ఒక ఐఎఏఏస్ ప్రభుత్వం తరఫు నుంచి ఒక్క వాహనం కేటాయిస్తారు. రానురాను అది రెండుకు మారింది కానీ దానికి సంబంధించిన ఆదేశాలు మాత్రం లేవు. కానీ, మెజారిటీ అధికారులు వారి అర్హతలకు మించి ఇళ్లు, వాహనాలు, ఫోన్ లు వాడుతూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది అనేది ఐఎఎస్ లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.కనీసం ఐఎఎస్ ల వాహనాలకు పెట్రోల్,డీజిల్ బిల్లులు చెల్లించ లేని స్థితిలో రాష్ట్రం ఉంది. బిల్లు కడితేనే డీజిల్ అని పెట్రోల్ బంకులు ఐఎఎస్ ల కార్లు వెనక్కి పంపిన సంఘటనలున్నాయి. ఇవన్నీ తెలిసినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా వాడుకోవటం మాత్రం తగ్గడం లేదు.