విశాఖ ఉక్కుపై కేంద్రానికి నోటీసులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్‌ చేస్తూ రిటైర్డ్ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్పందించిన ఉన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చన్నారు. సమస్యకు ప్రైవేటీకరణ పరిష్కారం కాదని పిటిషన్‌లో తెలిపారు.

విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు లక్ష్మీనారాయణ. తాజాగా, హైకోర్టులో పిల్ దాఖలు చేయడం, కేంద్రానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. 

మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. కార్మికులు, స్థానికులు, ప్రతిపక్ష పార్టీలు.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు  అంటూ ఉద్యమిస్తున్నాయి. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే ఆసక్తి మొదలైంది.