విశాఖలో ల్యాండ్ పూలింగ్.. పేదలు భూములు ఇస్తే ఉగాదికి కొత్త ఫ్లాట్

విశాఖకు రాజధాని ప్రకటనతో స్టీల్ సిటీలో ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖ శివారు గ్రామాల్లో 6,000 ఎకరాల సేకరణకు సర్కారు జీవో జారీ చేసింది. జీవో 72 ప్రకారం సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెదగంట్యాడ, అనంతపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికారుల హడావుడి మొదలయ్యింది. ల్యాండ్ పూలింగ్ కింద సేకరించే భూములను విశాఖపట్నం మెట్రోపొలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీకి అప్పగించారు. ఇప్పటికే అధికారులు ఆయా మండలాల పరిధిలో అసైన్డ్ ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

ఆ స్థలాల్లో వీఎంఆర్డీఏ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనుంది. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వ భూములతో పాటు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తుంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటోందని సిపిఎం మండిపడుతోంది. ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకిస్తామన్నారు సీపీఎం పార్టీ నేత మధు. భూ సేకరణ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.