అమ్మఒడి పథకం అమలు కొరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులకు గండి!!

అమ్మఒడి పథకంలో అడుగడునా అడ్డంకులు పడుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి డబ్బులు లేకపోవడంతో పక్క చూపులు చూస్తోంది. నిధుల సమీకరణకు దారిలేక ఇతర సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. అలా వచ్చిన డబ్బులనే అమ్మఒడి పథకం కోసం ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. నిధుల మళ్లింపునకు సంభదించి ఒక జీవోను కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై ఆయా సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. అమ్మఒడి పథకంతో ప్రభుత్వం పై రూ.6455 కోట్ల రూపాయల భారం పడనుంది. అయితే ఇందు కోసం ఇతర సంక్షేమ శాఖలకు కేటాయించిన నిధులను ఖర్చు పెట్టడం వివాదస్పదమవుతోంది. ఇప్పటికే సంక్షేమ శాఖ నుండి రూ.3,432 కోట్లు, కాపు కార్పొరేషన్ నుండి రూ.568 కోట్లను వెనక్కి పంపాలని ప్రభుత్వం కోరింది. అలాగే సాంఘీక సంక్షేమ శాఖ రూ.1271 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ రూ.442 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖను రూ.395 కోట్లను పంపాల్సిందిగా ఆదేశించింది. 

ప్రభుత్వం కోరిన నిధులు ఆయా శాఖలకు కేటాయించిన నిధుల్లో 90 శాతంతో సమానమని శాఖా అధికారులు అంటున్నారు. దాదాపుగా అన్ని శాఖల గల్లా పెట్టెలు ఖాళీ చేసి.. కేవలం 10 శాతం నిధులు మాత్రమే వారి వద్ద మిగిలే అవకాశాలు ఉన్నాయి. అలా చేయడంతో ఆయా శాఖలు చేపట్టే కార్యక్రమాలు అమలు చేయటం అసాధ్యం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు, కుల సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తమ దగ్గర ఉన్న నిధులన్ని అమ్మఒడి పథకానికి కేటాయిస్తే తమ సంక్షేమం సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇదే విషయమై ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి లోకేష్. జగన్ ప్రభుత్వం మరో యూటర్న్ నిర్ణయాన్ని తీసుకుందని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను తీసుకుని అందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.