ఏపీలో భూముల రీసర్వే నేటి నుంచే.. కృష్ణా జిల్లాలో స్టార్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే ప్రక్రియను చేపట్టాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. నేటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. పైలెట్ ప్రాతిపదికన కృష్ణాజిల్లా జగ్గయ్య పేట నుంచి మొదలు పెట్టనున్నారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా వినియోగించే బేస్ స్టేషన్ ను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన భూముల సర్వే ప్రస్తుతం తప్పుల తడకగా మారడంతో రీసర్వే చేపట్టాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

అయితే ఆధునిక సాంకేతికతను ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. విదేశాలతో పాటు పరిమితంగా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల వినియోగిస్తున్న కార్స్ అనే టెక్నాలజీ ద్వారా భూముల రీసర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 65 బేస్ స్టేషన్ లు ఏర్పాటు చేసి రీసర్వే ప్రక్రియను చేపట్టనుంది ప్రభుత్వం. సర్వే అండ్ బౌండరీస్ చట్టం 1923 ప్రకారం చేసిన సర్వే ఆధారంగానే ప్రస్తుతం కార్యాకలాపాలు జరుగుతున్నాయి. జమాబంది పేరుతో 1990 వరకు గ్రామీణ ప్రాంతాల భూముల వివరాలను నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత భూరికార్డులు అన్నీ తప్పుల తడకగా మారడంతో రీసర్వేను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అంతేకాకుండా ఇప్పుడు క్రాస్ సాంకేతిక సాయంతో ఉపగ్రహ ఛాయా చిత్రాల జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా సర్వే ప్రక్రియను చేపట్టనున్నారు. రీసర్వే ప్రక్రియ తర్వాత రీసర్వే రిజిస్టర్ ను రూపొందించనుంది ప్రభుత్వం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే రీసర్వే ప్రక్రియ కోసం మొత్తం 2000  కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎప్పటికప్పుడు భూ రికార్డులను సవరించడం ద్వారా వివాదాలు కూడా లేకుండా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. కార్స్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు భూకమతాల వైశాల్యాన్ని నిర్దేశించి నమోదు చేయ వచ్చనేది ప్రభుత్వ ఆలోచన. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3.31 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2022 నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి రెవెన్యూ రికార్డుల ద్వారా ఉత్పన్నమయ్యే విధానాలను తగ్గించే ప్రయత్నం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతుంది.