అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ శుభవార్త...

 

ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఇచ్చిన హామీలలో మరో ముందడుగు పడింది. అగ్రి గోల్డ్ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరపాలని,మొదటగా పదివేల లోపు డిపాజిటర్ లకు పేమెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఈ మేరకు మూడు లక్షల అరవై తొమ్మిది వేల మందికి రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. హై కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా లీగల్ సెల్ ద్వారా నగదు అందజేయనుంది. మరోవైపు ఇరవై వేల రూపాయల లోపు డిపాజిటర్లకి కూడా చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. కోర్టు సూచనల మేరకు చెల్లించబోతోంది నగదు రూపంలో చెల్లించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. 

అగ్రి గోల్డ్ బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తం నుంచి బాధితులకు డబ్బులు ఇవ్వబోతోంది ప్రభుత్వం. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రతి జిల్లాలో అగ్రి గోల్డ్ బాధితులు సీఎం జగన్ ను కలిసినప్పుడు వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకునే వారు సహా వేలాది మంది మధ్య తరగతి జనం అగ్రి గోల్డ్ లో తమ డబ్బు డిపాజిట్ చేశారు.మోసపోయిన బాధితులు తమకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలని పాదయాత్రలో జగన్ ను కోరారు. 

పది వేల రూపాయల లోపు డిపాజిటర్ లకు కలెక్టర్ల ద్వారా నగదు అందించబోతోంది ప్రభుత్వం. జిల్లాల వారీగా బాధితులు వారికి అందే మొత్తాన్ని పరిశీలిస్తే.. గుంటూరు జిల్లాలో పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క మందికి పద్నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు, చిత్తూరు జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు మందికి ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు మందికి పదకొండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇరవై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు, విజయనగరం జిల్లాలో యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి ముప్పై ఆరు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం జిల్లాలో నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మందికి ముప్పై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు, కర్నూలు జిల్లాలో పదిహేను వేల ఏడు వందల ఐదు మందికీ పదకొండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మందికి పదహారు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై నాలుగు మందికి పదిహేను కోట్ల నాలుగు లక్షల రూపాయలు, అనంతపురం జిల్లాలో ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి ఇరవై కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు, కడప జిల్లాలో పధ్ధెనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మందికి పదమూడు కోట్ల పధ్ధెనిమిది లక్షల రూపాయలు, ప్రకాశం జిల్లాలో ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఆరు మందికి పంతొమ్మిది కోట్ల పదకొండు లక్షల రూపాయలు, విశాఖపట్నంలో యాభై రెండు వేల ఐదు మందికీ నలభై ఐదు కోట్ల పది లక్షల రూపాయలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇవి నిజంగా ప్రజలకు చేరి వారికి తగిన న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.