ఎట్టకేలకు సీబీఐకి ప్రీతి సుగాలి అత్యాచారం, హత్య కేసు.. ఏపీ సర్కార్ ఆదేశాలు

2017లో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతీ బాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కేసును విచారించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇప్పటికీ దోషులను పట్టుకోకపోవడం వంటి కారణాలతో ప్రీతి కుటుంబ సభ్యులు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే డిమాండ్ తో కర్నూలులో ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ తర్వాత కర్నూలు పర్యటనలో ప్రీతి కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడిన సీఎం జగన్.. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీ బాయి స్కూలు హాస్టల్లోనే ఉరేసుకుంది. అప్పట్లో దీన్ని ఆత్మహత్య కేసుగా తేల్చిన పోలీసులు కేసును మూసేశారు. కానీ పోస్టు మార్టమ్ నివేదికలో ఆమె జననాంగాల్లో వీర్య కణాలు ఉన్నట్లు నిర్ధారించింది. అదే సమయంలో ఉరేసుకున్న వ్యక్తి కాళ్లు నేలకు తాకుతూ ఎలా ఉంటాయన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.  దీంతో అప్పటి అధికార టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తోసిపుచ్చిన ప్రీతి తల్లితండ్రులు ఆరోపించారు. స్ధానికుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో జిల్లా కలెక్టర్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్డీవో, డీఈవో, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ తో కూడిన ఈ కమిటీ ఘటన జరిగిన పాఠశాలను సందర్శించి ఆధారాలు సేకరించింది. అయితే ఈ కమిటీ దర్యాప్తు కూడా నత్తనడకన సాగింది.  

ఆ తర్వాత ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు వైద్యారోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజు నిందితుల వద్ద 5 లక్షలు డిమాండ్ చేశారని మృతురాలి తల్లి ఆరోపించారు. మరోవైపు ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కర్నూలు మెడికల్ కాలేజీ బృందం దీన్ని అత్యాచారం, హత్యగా నిర్ధారించింది. అయితే ఇదే బృందంలో సభ్యుడిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పోస్టుమార్టం నివేదికను తారుమారు చేశారని ప్రీతి తల్లి ఆరోపించారు.

చివరికి 2017 ఆగస్టులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు పోస్కో చట్టం కింద ప్రీతి హత్యకు గురైన కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం ప్రీతి కేసుపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీ తన నివేదికను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు సమర్పించారు. అయితే ఈ నివేదికలో ప్రీతిది ఆత్మహత్యేనని వారు తేల్చారు. ఆ తర్వాత ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న డీసీపీ వినోద్ కుమార్... ఐపీసీ సెక్షన్లు 302, 201 తో పాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేయలేదని గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను మార్చిన ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో డీసీపీ వినోద్ కుమ్మక్కాయని కూడా ప్రీతి తల్లి ఆరోపించారు. 

ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో ప్రీతి హత్యాచార కేసుపై అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ మరోసారి విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ .. పోస్టు మార్టం నివేదిక తారుమారైందని తేల్చారు. కానీ తాను నివేదికను తారుమారు చేయలేదని దాన్ని రూపొందించిన డాక్టర్ శంకర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన్ను ఈ ఘటనకు బాధ్యడిగా గుర్తిస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ శంకర్.. తాను మూడు గంటల పాటు నిర్వహించిన పోస్టుమార్టంలో ప్రీతి అత్యాచారం, హత్యకు గురైందని మరో నివేదిక ఇచ్చారు.    

ఈ నివేదిక వెలువడ్డాక ప్రీతి తల్లితండ్రులు ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపిస్తే కానీ తమ కుమార్తెకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. తాజాగా కర్నూలులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మృతురాలు ప్రీతికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రీతికి న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం కర్నూల్లో హైకోర్టు పెట్టి ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని కూడా ప్రశ్నించారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ సంచలన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.