చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల దర్యాప్తులో సిట్ కు విశేషాధికారాలు.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను తప్పుబడుతూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను మరింత లోతుగా విచారించేందుకు ఏర్పాటైన సిట్ కు ప్రభుత్వం అసాధారణ అధికారాలు కట్టబెట్టింది. సంచలన రీతిలో సిట్ నే పోలీసు స్టేషన్ గా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తీసుకొచ్చింది. సీఆర్పీసీ నిబంధనలకు లోబడి రాష్ట్రంలో ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా పిలిపించే అధికారాన్ని సిట్ కు అప్పగిస్తూ తాజాగా జీవో జారీ చేసింది.

రాష్ట్రంలో గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో అక్రమాలు చోటుచేసుకున్నారని ఆరోపిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై సిట్ విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం సిట్ కు అసాధారణ అధికారాలు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంతే కాకుండా ఏకంగా సిట్ నే పోలీసు స్టేషన్ గా పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి ఏ వ్యక్తినైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా పిలిపించి ప్రశ్నించేందుకు సిట్ కు విశేష అధికారాలు కట్టబెట్టారు. ఆర్ధిక నేరాల దర్యాప్తులో సమర్ధుడైన ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డితో పాటు పది మంది అధికారులతో ఈ సిట్ ఏర్పాటైంది. ఈ వారంలో సిట్ తమకు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మేరకు అప్పగించిన అంశాలపై దర్యాప్తు ప్రారంభించనుంది. వీటిలో రాజధాని అమరావతి భూసేకరణ, ఎర్రచందనం, విశాఖలో భూదందా వంటి కీలక అంశాలు ఉన్నాయి.

తాజాగా సిట్ కు అప్పగించిన విశేషాధికారాలను బట్టి చూస్తుంటే టీడీపీకి చెందిన ముఖ్యనేతలను దర్యాప్తులో భాగంగా పిలిపించి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సిట్ ను ఏకంగా పోలీసు స్టేషన్ గా పరిగణించాలన్న ఆదేశాలు కూడా అసాధారణంగా ఉన్నాయి. దర్యాప్తు నిర్వహణ, కేసుల నమోదు, వాటిపై తుది నిర్ణయాలను తీసుకునే అధికారం కూడా ప్రభుత్వం సిట్ కు కట్టబెట్టింది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.