గల్లా జయదేవ్ ‌కు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కి చెందిన కంపెనీకి వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఇన్ఫోటెక్‌కు కేటాయించిన భూమిలో సగానికి పైగా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలను వెనక్కు తీసుకుంటున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ నుంచి భూమిని వెనక్కు తీసుకునేందుకు ఏపీఐఐసీకి పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

2009లో చిత్తూరు జిల్లా యడమర్రి మండలం కొత్తపల్లిలో డిజిటల్ వరల్డ్ సిటీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ కు అప్పటి రోశయ్య ప్రభుత్వం కేటాయించింది. ఆ ఒప్పందం ప్రకారం అమర్ రాజా కంపెనీ రూ. 2,100 కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకొస్తామని, తద్వారా 20వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. కానీ అంత పెట్టుబడులు తీసుకురాక పోగా.. కేవలం 4,310 మంది మాత్రమే ఉపాధి కల్పించింది. దీంతో, పదేళ్లు దాటినా నిబంధనల ప్రకారం ఉద్యోగాల కల్పన, సంస్థ విస్తరణ లేకపోవడంతో 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొంది.