ప్రజా వేదిక కూల్చివేత శిధిలాల తొలగింపుకు టెండర్లు పిలిచిన జగన్ సర్కార్

 

 

ఏపీలో అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా నేలమట్టం చేసిన ఉండవల్లిలోని ప్రజావేదిక శిధిలాల తొలగింపుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. సీఎం జగన్ అధికారం చేపట్టగానే మొదటిసారి నిర్వహించిన కలెక్టర్ల సమావేశం తర్వాత ప్రజావేదికను కూల్చివేశారు. కానీ అప్పటి నుంచి వాటి శిధిలాలను అక్కడి నుంచి తరలించలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వీటిని అక్కడే ఉంచినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా శిధిలాల తొలగింపు కోసం టెంటర్లను ఆహ్వానించింది. మార్చి 3 వరూ ఆన్ లైన్ లో టెండర్లు స్వీకరించనున్నారు. 

ఏపీలో 2014లో అధికారంలోకి రాగానే హైదరాబాద్ నుంచి పాలన సాగించిన అప్పటి సీఎం చంద్రబాబు, ఓటుకు నోటు కేసు వివాదం తర్వాత అమరావతికి తరలివచ్చారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామం వద్ద కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని లీజుకు తీసుకున్న చంద్రబాబు అక్కడి నుంచే పాలన ప్రారంభించారు. తన నివాసం పక్కనే ప్రజావేదిక పేరుతో ఐదు కోట్ల రూపాయలతో ఓ ప్రాంగణాన్ని నిర్మించారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. కరకట్టపై నదీ చట్టాలను ఉల్లంఘించి ఇల్లు కట్టుకోవడమే నేరమైతే ప్రజావేదికను ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించింది. అయినా అప్పటి సీఎం చంద్రబాబు మాత్రం అవేవీ పట్టించుకోకుండా అతి తక్కువ సమయంలో తాత్కాలిక నిర్మాణంగా ప్రజావేదికను నిర్మించడమే కాకుండా అక్కడే కలెక్టర్ల సమావేశాలతో పాటు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు నిర్వహించేవారు. 

గతేడాది వైసీ అధికారం చేపట్టిన వెంటనే సీఎం జగన్ ప్రజా వేదికపై దృష్టిపెట్టారు. అధికారంలోకి రాగానే నిర్వహించిన మొట్టమొదటి కలెక్టర్ల సమావేశానికి ప్రజావేదికను వేదికగా మార్చిన జగన్.. నిబంధలను ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు కడుతుంటే మీరేం చేస్తున్నారంటూ కలెక్టర్లను నిలదీశారు. కలెక్టర్ల భేటీ ముగిసిన వెంటనే అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చేయాలని ఈ భేటీలోనే ఆదేశాలు సైతం ఇచ్చారు. దీంతో కలెక్టర్ల సమావేశం ముగిసిన వెంటనే సీఆర్డీఏ అధికారులు ప్రజావేదికను నేలమట్టం చేశారు. అయితే శిధిలాలను మాత్రం అక్కడి నుంచి తొలగించలేదు. దీంతో శిధిలాల తొలగింపును ప్రభుత్వం ఉద్దేశపూర్వంగానే వదిలేసిందనే విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు శిదిలాల తొలగింపు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. మార్చి 3 వరకూ  దరఖాస్తుల స్వీకరణకు గడువు కూడా ఇచ్చింది. శిధిలాల తొలగింపుతో పాటు ఇనుము వేలానికి కూడా టెండర్లు పిలిచింది. దీంతో ఈ వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడినట్లయింది.