ఈసారయినా వికేంద్రీకరణ జరుగుతుందా?

 

రాష్ట్ర విభజనను కలలోనైనా ఊహించని పాలకులు అందరూ హైదరాబాదు మనదేననే భావనతో కేవలం దానినే అభివృద్ధి చేసుకొంటూపోయారు తప్ప మిగిలిన జిల్లాల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదు. నానాటికీ హైదరాబాదు దేశంలోనే మేటి నగరాలలో ఒకటిగా ఎదుగుతుంటే అందుకు తెలుగువారు అందరూ గర్వంతో ఉప్పొంగిపోయారు తప్ప ఏనాడు తమ జిల్లాలను హైదరాబాదుతో సమానంగా ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించలేదు. హైదరాబాదుపై రాష్ట్ర ప్రజలందరూ అంతటి మమకారం పెంచుకొన్నారు. కానీ అందరూ కలిసి అభివృద్ధి చేసుకొన్న హైదరాబాదును రాష్ట్ర విభజన కారణంగా వదులుకోవలసి రావడమేగాక, విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ మిగిలిపోయింది. అంతేకాదు.. హైదరాబాదు మనదేననే భావనతో రాష్ట్రం నలుమూలల నుండి అక్కడకు వచ్చి స్థిరపడినవారందరూ ఇప్పుడు ‘సెకండ్ ‘క్లాస్ సిటిజన్స్’ గా మిగిలిపోయారు.

 

అందువల్ల అటువంటి ఘోర తప్పిదం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పునరావృతం కాకూడదనే ధృడాభిప్రాయం పాలకులలోనే కాక ప్రజలలో కూడా నెలకొందిప్పుడు. ఇకనయినా పాలనను, అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి రాష్ట్రంలో 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చెందేలా చేయాలని ప్రజలందరూ కోరుకొంటున్నారు. కానీ ఈ నెల రోజుల కాలంలో మంజూరు చేయబడిన అనేక సంస్థలు, అభివృద్ధి పధకాలు అన్నీ కేవలం కొన్ని ప్రధాన నగరాలు, జిల్లాలకే పరిమితమవుతున్నట్లు కనబడుతోంది. ఇప్పుడే ఈవిధంగా భావించడం తొందరపాటే అనుకొన్నప్పటికీ, కంటికి మాత్రం ఆవిధంగానే కనబడుతున్నాయి. ఆ కారణంగానే మళ్ళీ అదే తప్పు పునారావృతం కాబోతోందా? అనే అనుమానాలు విజయనగరం, శ్రీకాకుళం, కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అనంతపురం జిల్లాల వాసులలో కలుగుతున్నాయి. ఇంతకాలం తీవ్ర నిరాదరణకు గురయిన తమ ప్రాంతాలను ఇకనయినా ప్రధాన జిల్లాలు, నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలని అక్కడి ప్రజలు కోరుకొంటున్నారు.

 

అందువల్ల 13జిల్లాలలో లభ్యమయ్యే స్థానిక వనరులు, అవకాశాలను పూర్తిగా వినియోగించుకొనేవిధంగా అభివృద్ధి పధకాలను, సంస్థలను ఏర్పాటు చేసుకొని రాష్ట్రమంతా ఒకేస్థాయిలో అభివృద్ధి సాధించాలని రాజకీయ నాయకులు, ప్రజలు కోరుకోవాలి తప్ప అన్నీ తమ ప్రాంతానికే దక్కాలని కోరుకోవడం వల్ల రాష్ట్ర ప్రజల మధ్య కూడా విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఏమయినప్పటికీ ఇంకా కేంద్ర, ప్రభుత్వాలు తమ అభివృద్ధి ప్రణాళికలను ఇంకా ఖచ్చితంగా ప్రకటించలేదు గనుక ఈసారి తప్పకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆశిద్దాము.