48 గంటలు ఏపీని వణికించిన పెథాయ్ తుఫాన్

48 గంటల పాటు ఏపీని వణికించిన పెథాయ్ తుఫాన్ తీరాన్ని దాటింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర మధ్యాహ్నం పెథాయ్ తుఫాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు వెల్లడిం‍చారు. మరో రెండు గంటలపాటు తుపాన్‌ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. గాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, సెల్​టవర్లు, కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆలయ ధ్వజ స్తంభం కూలిపోయింది. కాట్రేనికోనలో కారుపై విద్యుత్‌ స్తంభం కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

 

 

తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు కాగా.. విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. విశాఖకు రావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. విమానాశ్రయంలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తుపాను దృష్ట్యా తీరప్రాంత జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలకు సెలవు ప్రకటించారు. పెథాయ్‌ తుపాన్‌పై చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. విపత్తుల సమయంలో ఎవరూ సెలవులు పెట్టరాదని.. అందరూ విధులకు హాజరై అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలని సీఎం స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో విపత్తులు కొత్త కాదని, భవిష్యత్తులోనూ తుపాన్లు వస్తాయన్న ఆయన... అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్ల కాలమేనని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.