ఏపీ సీఎస్ నీలం సాహ్ని సెలవు వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా !

 

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారని కొంతకాలం క్రితం ప్రచార జరిగింది. సీఎంవో ఉన్న ఇతర అధికారులతో ఆమెకు పొసగడం లేదని ఓసారి, కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపునకు ఆమె ప్రమేయం లేకుండానే ఆదేశాలు వెలువడటంతో నొచ్చుకున్నారని మరోసారి ప్రచారం సాగింది. అయితే తాజాగా ఆమె సన్నిహితులు చెబుతున్న ప్రకారం నీలం సాహ్ని ఆమె పదవీకాలం ముగిసేవరకూ అంటే జూన్ చివరి వరకూ తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తిస్ధాయిలో నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు తెలిసింది.

గతేడాది టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎప్పటిలాగే ఏపీ సీఎంవోలో మార్పులు చేర్పులు జరిగాయి. ప్రతీ ముఖ్యమంత్రిలాగే అధికారంలోకి రాగానే తన టీమ్ ను సీఎం జగన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాను ఏరికోరి తెచ్చుకున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సాగనంపడంతో అధికారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. సీఎస్ నే అర్ధాంతరంగా తప్పించినప్పుడు తమ పరిస్ధితి ఏంటనే ఆందోళన ఐఏఎస్ లతో పాటు మిగిలిన అదికారుల్లోనూ కనిపించింది. అయితే సీఎంవోలో సీఎం రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఆధిపత్య ధోరణి వల్లే అప్పట్లో సీఎల్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత మిగిలిన అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ప్రచారం సాగింది. తాజాగా ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ కూడా ప్రవీణ్ ప్రకాష్ వైఖరితో విసిగిపోయి దీర్ఘకాలిక సెలవుపై  వెళ్లాలని భావిస్తున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది. కొన్ని రోజుల్లోనే ఇది కాస్తా ముదిరి ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న నీలం సాహ్ని ఏకంగా సీఎస్ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది.

చివరికి ఈ వివాదాలపై సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. సీఎస్ నీలం సాహ్నితో నేరుగా మాట్లాడి తనపై జరుగుతున్న ప్రచారం గురించి తెలుసుకున్నారు. చివరికి ఆమెకు అలాంటి ఉద్ధేశాలేవీ లేవని తెలియడంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది. గతంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అర్ధాంతరంగా బదిలీ చేసిన నేపథ్యంలో నీలం సాహ్ని విషయంలో ఏం జరిగినా అది చివరికి ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో సీఎం జగన్, ఇతర సీనియర్ అధికారులు నీలం సాహ్ని అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఆమెకు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలన్న ఉద్దేశం కానీ, సీఎస్ పదవి నుంచి తప్పుకోవాలనే ఆలోచన కానీ లేనట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో సీఎస్ విషయంలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. వాస్తవానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ తర్వాత కేంద్ర సర్వీసుల్లో ఉన్న సాహ్నీని రాష్ట్రానికి తీసుకొచ్చి మరీ సీఎస్ పదవి కట్టబెట్టారు. ఆమెకు కూడా నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే మంచి పేరుంది. కానీ ప్రభుత్వంపై గిట్టని వారు కొందరు చేసిన ప్రచారం కారణంగా ఆమె సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్దితి ఏర్పడిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా మూడు రాజధానుల ప్రక్రియకు ప్రభుత్వం సన్నద్ధమైన కీలక సమయంలో సీఎస్ వ్యవహారం సద్దుమణగడంతో ప్రభుత్వం కూడా ఊపరిపీల్చుకున్నట్లయింది.