జగన్ సర్కార్ కి షాక్... ఫలించిన బాబు వ్యూహం.. మూడు రాజధానుల బిల్లుకి బ్రేక్!

జగన్ ప్రభుత్వానికి మండలిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల బిల్లును ఎలాగైనాసరే ఆమోదించుకోవాలనుకున్న వైసీపీ సర్కారుకు ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి, బిల్లు ఎట్టిపరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీ వెళ్లకూడదని గట్టి పట్టుదలతో ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది. మంగళవారం రూల్ 71తో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చేసుకున్న ప్రతిపక్ష టీడీపీ తాను అనుకున్నట్లుగా ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంలో సక్సెసైంది. దాంతో, మూడు రాజధానుల ప్రక్రియ మూడు నెలలపాటు ఆగిపోనుంది. 

ఎందుకంటే, ఏ బిల్లు అయినాసరే సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తే ఆ ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. అందుకే, ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లు సెలెక్ట్ కమిటీ వెళ్లకుండా చేయాలని జగన్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా వీగిపోయినా ఫర్వాలేదని ప్రభుత్వం భావించింది. కానీ వైసీపీ సర్కారు వ్యూహాన్ని టీడీపీ తెలివిగా దెబ్బకొట్టింది. దాంతో, ఆగమేఘాల మీద రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ముగించాలనుకున్న జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.

అనేక పరిణామాలు, అత్యంత ఉత్కంఠ మధ్య మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ శాసనమండలి నిర్ణయం తీసుకుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాదాపు 20మంది మంత్రులు మండలికి రావడమే కాకుండా, బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రతిపక్ష టీడీపీ పైచేయి సాధించింది. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడంతో వైసీపీ వ్యూహాలను అడ్డుకునేందుకు కౌన్సిల్ గ్యాలరీలోనే కూర్చున్న చంద్రబాబు.... టీడీపీ ఎమ్మెల్సీలను గైడ్ చేస్తూ... రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా చక్రం తిప్పారు.

అయితే, ఓటింగ్ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలను తమవైపు లాగేందుకు వైసీపీ ప్రయత్నించింది. ఏకంగా 20మందికి పైగా మంత్రులు కౌన్సిల్ కు రావడమే కాకుండా అత్యధిక సమయం మండలిలోనే గడిపారు. పోడియం దగ్గరకు వచ్చి ఆందోళన సైతం చేయడంతో కొద్దిసేపు మండలిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించడంతో మూడు రాజధానుల బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లింది.