నిమ్మగడ్డయితే... ప్రవీణుడికంటే ఎక్కువా ఏంటీ?

ఎల్వీ-ఏబీవీకే దిక్కులేదు

 

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను.. తన సముఖానికి రమ్మని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్  హుకుం జారీచేశారట. దానిపై నిమ్మగడ్డ వారు ఆగ్రహోదగ్రుడయి.. నా అంత ప్రముఖుడినే భేటీకి రమ్మంటారా? మీ సంగతి కోర్టులో తేలుస్తానని అగ్గిరాముడయ్యారట. ఇది ఇప్పుడు మీడియాకు పెద్ద వార్త. దానిపై బోలెడన్ని విశ్లేషణలు!

 

ఐఏఎస్ చదివిన నిమ్మగడ్డ వారు కూడా, మామూలు పామరుల మాదిరిగా ఆలోచించడమే హాశ్చర్యం. నిమ్మగడ్డ రమేషుల వారు రాష్ట్ర ఎన్నికల కమిషనరే  కావచ్చు. పూర్వాశ్రమంలో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసి ఉండవచ్చు. గవర్నర్‌కే సలహా ఇచ్చేంత మేధావి కావచ్చు. కానీ అవన్నీ మా ప్రవీణ్ ప్రకాష్ ముందు జాన్తానై! సారు చిన్నప్పటి నుంచీ అంతే! ఆయన దగ్గర ఉత్తరాది పప్పులు తప్ప, మరెవరి పప్పులూ ఉడకవు. అందుకే ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు పోస్టింగు పోయిన సతీష్ చంద్ర మాత్రమే మళ్లీ పోస్టింగు తెచ్చుకోగలిగారు మరి. అందుకే ఆయన దగ్గర తెలుగువాళ్ల పప్పులుడకవు. జగన్ ఉండగనే, జగన్ అంశలో పుట్టిన మరో జగన్ ఆయన! కాబట్టి.. నిమ్మగడ్డే కాదు.. ఏ గడ్డయినా ప్రవీణుల వారి కచేరీకి,  కాకితో కబురంపితే, రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిందే. దట్సాల్!

 

నిమ్మగడ్డదేముంది? బూతుల మంత్రి కొడాలి నాని చెప్పినట్లు, వచ్చే ఏడాది రిటైరయి, హైదరాబాద్ వెళ్లిపోతారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ మాత్రం లోకల్. ఐదేళ్లూ ‘జగన్నా’ధుడి ఆలయంలోనే కొలువయి ఉంటారు. అయినా పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపిఎస్సులే ప్రకాష్ ప్రావీణ్యానికి సలాములు కొట్టి గులాములవుతుంటే, వచ్చే ఏడాది రిటైరయ్యే నిమ్మగడ్డ గోడు వినిపించుకునేదెవరు? ప్రవీణేదో ముచ్చటపడి, ఆ ఎలక్షన్ వ్యవహారాలపై మాట్లాడాలి రమ్మని పిలిచారనుకోండి. వెళ్లి కాసేపు సారు చెప్పింది విని, ఇస్తే.. టీ తాగి రెండు బిస్కట్లు తిని, జీ హుజూరని వచ్చేస్తే పోయేది.

 

అలాకాకుండా..  అంత పెద్ద మనిషిని, అంతలావు అధికారాలున్న అధికారిని, సీఎంనే ఖాతరు చేయనవసరం లేని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్నే రమ్మంటారా? హమ్మా? మీకెన్ని గుండెలు.. అసలు మీది గుండెనా? పోలవరం ప్రాజెక్టా అని,  సత్తెకాలపు చాదస్తాలకు వెళ్లి, ఆ విషయాన్ని ‘మిత్రమీడియా’కు లీకు చేయడం పిచ్చితనం కాక మరేమిటి? ఈ 17 నెలల కాలంలో,  జగనన్న తత్వం అర్ధం చేసుకోకపోవడమే నిమ్మగడ్డ తప్పు. బహుశా చాలా పథకాలకు జగనన్న పేరు పెట్టిన సర్కారు.. కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే ‘జగనన్న తత్వం’ అనే పథకం పెట్టి ఉంటే, అధికారులకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో?!

 

నిమ్మగడ్డ వారి ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. ఆఫ్టరాల్ సీఎం ముఖ్య కార్యదర్శి నన్ను పిలవటమేమిటన్నది, ఆయన అంతరంగం పడుతున్న ఆవేద న కావచ్చు. కానీ, నిమ్మగడ్డ వారు కొలువు చేస్తోంది ఏపీలో అని  గుర్తుంచుకోవాలి. క్రికెట్ గ్రౌండ్‌లో కబడ్డీ ఆడకూడదు. కాదని కబడ్డీ ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. అయినా.. ‘నన్నే పిలుస్తారా’ అని తెగ ఇదయిపోతున్న నిమ్మగడ్డను చూస్తే జాలి వేస్తుంది. తాను చెప్పింది చేయకుండా తల అడ్డంగా ఆడించిన, అంత పెద్ద చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యాన్నే శంకరిగిమాన్యాలు పట్టించారు. కోర్టుకెక్కి, తన ఉద్యోగం తనకివ్వాలని ఆదేశాలు తెచ్చుకున్న, డిజిపి స్థాయి సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకే ఇప్పటిదాకా, పోస్టింగు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. కోర్టుకెళ్లిన తర్వాత ఇస్తున్న సగం జీతానికీ కత్తెర వేశారు.  మొన్నామధ్య ఓ సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటే, అంతకంటే ముందే అదే వేధింపులకు గురయి..  మరో మహిళా అధికారి చనిపోతేనే,  ఇదేమిటని అడిగే దిక్కు-దమ్ము లేదు. నిజాయితీ గల అధికారిగా పేరుండి, పెద్దాయన వైఎస్ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన మాదిరెడ్డి ప్రతాప్‌ను వెళ్లగొట్టినా ఇదేం అన్యాయమని అడిగే నాధుడు లేడు.  పేరుకు ఐఏఎస్-ఐపిఎస్ అసోసియేషన్లు ఉన్నా, అవి లెటర్‌హెడ్ సంఘాలే.

 

మరి అంతలావు సీనియర్లే..   ప్రకాష్  ప్రావీణ్యంతో విలవిల్లాడుతుంటే, మరికొద్ది నెలల్లో రిటైరయ్యే ఈ నిమ్మగడ్డేమిటి? తన ముందు తోకాడిస్తున్నారని పెద్ద సారుకు కోపం రాదూ? మిగిలిన అధికారుల మాదిరిగా..  ఏదో వచ్చామా?.. విన్నామా?.. చెప్పిన చోట చెప్పినట్లు సంతకం చేశామా?.. వెళ్లామా?.. నెల జీతం తీసుకుంటున్నామా? అని వచ్చిన పని చూసుకుని వెళ్లకుండా,  ఇలా ఎదురు ప్రశ్నలు వేస్తే.. ‘జగన్నా’ధ ఆలయంలోని ప్రధానార్చాకులు, అర్చకులకు ఒళ్లు మండిపోదూ?.. హేమిటో ఈ అధికారులు ఎప్పుడు నేర్చుకుంటారో? ఏమో?!

-మార్తి సుబ్రహ్మణ్యం