జగన్‌ను ఇరికించిన కేసీఆర్..! అయినా నిప్పు లేకుండా పొగ రాదు కదా.!

కేంద్రంపైనా, బీజేపీపైనా ఉమ్మడి పోరు చేయాలని కేసీఆర్-జగన్ ఏకాభిప్రాయానికి వచ్చారంటూ వచ్చిన కథనాలతో జగన్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంపై ప్రముఖ పత్రికలు ప్రచురించిన కథనాలు జగన్ సర్కారులో గుబులు రేపుతున్నాయి.ప్రభుత్వం భయపడుతోంది. మోడీ గవర్నమెంట్ తోనూ, బీజేపీతోనూ సఖ్యతగా ఉంటూ వస్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... పేపర్లలో వచ్చిన కథనాలు చూసి కంగుతిన్నట్లు తెలుస్తోంది. దాంతో, కేంద్రం, బీజేపీ తీరుపై కేసీఆర్-జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన కథనాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమావేశంలో అసలు, కేంద్రం గురించి గానీ, అలాగే బీజేపీపైనా కానీ అస్సలు చర్చే జరగలేదని, ఇది దురుద్దేశపూరిత కథనం అంటూ ఏపీ సీఎంవో ప్రకటన ఇచ్చింది.

అయితే, కేంద్రం తీరుపైనా, బీజేపీ విధానాలపైనా ముఖ్యమంత్రుల మీటింగ్ లో తీవ్ర చర్చ జరిగినట్లు ప్రముఖ ప్రతికలు కథనాలు ఇచ్చాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ప్రముఖ పత్రిక... కేంద్రం చిన్నచూపు-తెలుగు రాష్ట్రాల అసంతృప్తి అంటూ మెయిన్ హెడ్డింగ్ తో ఫ్రంట్ పేజీ వార్త ప్రచురించింది. అలాగే, ఏపీ, తెలంగాణలో బీజేపీ అనుసరిస్తోన్న విధానాలు సరిగా లేవు... తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు... ఏపీ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం వ్యతిరేకిస్తోంది... కేంద్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు చేద్దామంటూ... ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారంటూ కథనం ఇచ్చింది. ఇక మరో పత్రిక... బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందాం... కనీసం గవర్నర్ల నియామకంపైనా రాష్ట్రాలను సంప్రదించలేదంటూ... కేసీఆర్-జగన్ మీటింగ్ పై కథనం ప్రచురించింది. దాంతో అప్రమత్తమైన జగన్ ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. కేంద్రం, బీజేపీ గురించి అస్సలు చర్చ జరగలేదని ప్రకటన చేసింది. అయితే, నిజంగానే కేంద్రం, బీజేపీ గురించి చర్చించకపోతే, తెలంగాణ సీఎంవో కూడా స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే కథనాలు నిజమేనని భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

నిప్పు లేకుండా పొగ రాదనే ఎంత సత్యమో... కేంద్రం తీరుపైనా, బీజేపీ విధానాలపైనా కేసీఆర్-జగన్ చర్చించకుండా కథనాలు రావనేది అంతే నిజం. అయితే, కేంద్రంతోనూ, మోడీ-అమిత్ షాతో సఖ్యతనే కోరుకుంటున్న జగన్ కు ఈ కథనాలు ఇబ్బంది కలిగించాయి. దాంతో వెంటనే సీఎంవోతో వివరణ ఇప్పించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు. దాంతో కేంద్రంపైనా, బీజేపీపైనా గుర్రుగా ఉన్నది కేసీఆర్ అయితే, అందులోకి జగన్ కి కూడా తెలివిగా లాగారనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ సవాలు విసురుతోంది... అలాగే 2023లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తోంది. దాంతో బీజేపీతో, మోడీతో కేసీఆర్ తీవ్రంగా విభేదిస్తున్నారు. పైగా మోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక, కేంద్రంలో కేసీఆర్ అస్సలు సత్సంబంధాలు కొనసాగించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అండ్ కాషాయ పార్టీతో కేసీఆర్ సై అంటే సై అంటున్నారని, కానీ మోడీ-అమిత్ షాతో తగువు పెట్టుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేని జగన్ ను ఇందులోకి లాగడంతోనే ఏపీ సీఎంవో వివరణ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాలతో కేసీఆర్ కు ఎలాంటి నష్టం లేకపోయినా, జగన్ కు మాత్రం ఇది కచ్చితంగా ఇబ్బందికర పరిణామమే అంటున్నారు విశ్లేషకులు.