రైతు భరోసా కార్యక్రమంలో మాట్లాడిన జగన్...

నేటి నుంచి రైతు భరోసా పథకం అమలు, ఇకపై పన్నెండు వేలకు బదులు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. వ్యవసాయ మిషన్ పై సీఎం జగన్ సుదీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రైతు భరోసాను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పది సంవత్సరాల తరువాత సోమసిల నీటితో కళకళలాడుతుందని, జగన్ ఒక రైతు బిడ్డగా నెల్లూరుకి వచ్చానని అన్నారు. దేశంలోనే రైతులకు అత్యధికంగా సాయం అందించే పథకం రైతు భరోసా పథకం అని తెలిపారు. కాసేపట్లోనే రైతు భరోసా సొమ్ము కౌలు రైతుల ఖాతాలో జమ అవుతుందని అన్నారు. ఈ పథకం రైతులకు అందించటం తన అదృష్టంగా భావిస్తున్నా అని సిఎం జగన్ అన్నారు. ఎన్నికల ముందు తన పాదయాత్ర సమయంలో గ్రామ గ్రామాన రైతుల ఆవేదనను చూశానని, వర్షాలు లేక రైతులు అల్లాడిన రోజులు చూశానని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నా అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

ఎనిమిది నెలల ముందే రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తున్నామని సగర్వంగా తెలియజేశామని రైతు భరోసా కార్యక్రమంలో సిఎం జగన్ పేర్కొన్నారు. ఎంత మంది రైతులు ఉన్నారో వారందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో దాదపు యాభై ఒక్క లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం అని తెలిపారు. ప్రస్తుతానికి తొమ్మిది వేల రూపాయలు అకౌంట్లో పడతాయని సంక్రాంతి సమయానికి రెండు వేల రూపాయలు ఖాతాలో పడతాయని జగన్ అన్నారు.