ఢిల్లీ వెళ్లినవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి: సీఎం జ‌గ‌న్‌

ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందకు వచ్చి చికిత్స తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయ‌ని సీఎం అన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి వారి అందర్నీ గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్య సదుపాయాలు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జగన్ సూచించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్షించారు.

కోవిడ్‌ –19 నివారణా చర్యలపై ముఖ్య‌మంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని వివరించారు.  వీరిలో చాలా మంది ఢిల్లీలో ల్లో నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వెల్లడించారు.

రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను అధికారులు సేకరించారు. జమాత్‌ నిర్వాహకుల నుంచి, పోలీసుల నుంచి, రైల్వే  నుంచి  ఇలా వివిధ రకాలుగా సమాచారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామని అధికారులు సి.ఎం. దృష్టికి తీసుకువెళ్లారు.

అర్బన్‌ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపైనా సర్వే జరుగుతుందా? లేదా? అని సి.ఎం. ఆరా తీశారు. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకు వచ్చి వారు ఆరోగ్య వివరాలు అందించాలని, వారు ముందుకు రాకపోతే వారి కుటుంబ సభ్యులకు నష్ట కలుగుతుందని సి.ఎం. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

అర్బన్‌ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం ఆరా తీశారు. సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లు ద్వారా డోర్‌ డెలివరీని ప్రోత్సహిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి దుకాణం ముందు  ధరలతో పట్టికను ప్రదర్శించాలని  సీఎం ఆదేశించారు.