కేసీఆర్ కి హ్యాట్సాఫ్‌ చెప్పారు సరే.. మరి మీరెప్పుడు చెప్పించుకుంటారు జగన్

 

ఏపీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు. హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. మహిళల రక్షణపై జగన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన కలచివేసిందన్నారు. దిశ హంతకులను కాల్చిచంపినా తప్పులేదని తనకు కూడా అనిపించిందని చెప్పారు. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో దాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌, హ్యాట్సాఫ్‌ టూ తెలంగాణ పోలీసులు అని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీలో గత ప్రభుత్వం హయాంలోనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని టీడీపీని ఉద్దేశించి జగన్ ఆరోపించారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరికీ అన్యాయం జరకుండా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు.

మహిళల రక్షణపై అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్ర సీఎంకి హ్యాట్సాఫ్‌ చెప్పటం కాదని.. మీరు కూడా హ్యాట్సాఫ్‌ చెప్పించుకునేలా పని చేయండని కొందరు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటున్నారు.. కానీ మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా సుగాలి ప్రీతి కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. తమ పార్టీ వ్యక్తని గత ప్రభుత్వం కేసుని నీరుగార్చింది, ఇప్పుడు ఒకే సామాజికవర్గమని మీరు నీరుగారుస్తున్నారా అని నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.