జగన్ కేసుపై తీవ్ర ఉత్కంఠ... నాంపల్లి కోర్టు తీర్పుపై వైసీపీలో టెన్షన్

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. అయితే, జగన్ కచ్చితంగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనంటూ సీబీఐ దాఖలుచేసిన కౌంటర్ పిటిషన్ పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తనపై అనేక బాధ్యతలు ఉన్నాయని, అందువల్ల కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ అభ్యర్ధించారు. దాంతో సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఓ సాధారణ ఎంపీగా...జైల్లో ఉన్నప్పుడే తన బలమేంటో చూపించి సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు ప్రభుత్వాధినేతగా సాక్షులను మరింత ప్రభావితంచేసే అవకాశముందని సీబీఐ వాదనలు వినిపించింది. వాస్తవాలను దాచిపెట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారంటూ సీబీఐ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర విభజనతో ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమంటూ కోర్టుకు తెలిపింది సీబీఐ. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనేక సౌకర్యాలు కల్పిస్తారని, ఆ సౌకర్యాలతో వారానికోసారి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం పెద్ద కష్టమేమీ కాదని సీబీఐ వాదించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వ్యక్తిగతంగా హాజరుకావడం ఎంతో అవసరమన్న సీబీఐ.... జగన్ పిటిషన్ ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని కోరింది.

అయితే, సీబీఐ కౌంటర్ పిటిషన్ పై జగన్ తరపు లాయర్లు తమ వాదనలు వినిపించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని అభ్యర్ధించనున్నారు. అయితే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించిన సీబీఐ కోర్టు... మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి. ఒకవేళ సీబీఐ వాదనల వైపు మొగ్గుచూపి జగన్ పిటిషన్ ను కొట్టివేస్తే... ముఖ్యమంత్రి హోదాలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే సీఎంగా దేశవ్యాప్తంగా సంచలనం కావడం ఖాయం.