జగన్ వ్యూహంలో మెగాస్టార్ చిక్కుకుంటారా? టాలీవుడ్ పై అసలు వైసీపీ వ్యూహామేంటి?

 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరు. గతంలో జగన్-చిరంజీవి మధ్య పొరపచ్చాలున్నప్పటికీ, మెగాస్టార్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగారు. అసలు పాలిటిక్స్‌ అనే పదం వినడానికి కూడా చిరంజీవి ఇష్టపడటం లేదని అంటారు. ఇక, రాజకీయంగా పవన్‌తోనూ ఎలాంటి సంబంధం లేదని ఎన్నోసార్లు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే, చిరంజీవితో సమావేశానికి జగన్ ఒప్పుకోవడం జరిగిందని, అదేసమయంలో ఇండస్ట్రీ పరిణామాలపై చర్చించారని ప్రభుత్వ, పార్టీ వర్గాలు అంటున్నాయి. 

సాధారణంగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా, సినిమా పరిశ్రమ పెద్దలు, పాలకులను కలిసి, అభినందించాలనుకుంటారు. కానీ జగన్‌ సీఎం అయి, నాలుగు నెలలు అవుతున్నా, ఇప్పటివరకు, సినిమా పరిశ్రమ పెద్దలు జగన్‌ను కలవడానికి రాలేదన్న విమర్శ ఉంది. అయితే, టాలీవుడ్ పెద్దలు ఇప్పటివరకు, జగన్ను కలవకపోవడానికి కారణం, చంద్రబాబు కనుసన్నల్లోనే ఇండస్ట్రీ నడుస్తోందని వైసీపీ బలమైన అనుమానం. అందుకే ఇండస్ట్రీలో ఒకవర్గం ఆధిపత్యాన్ని తగ్గిస్తే, ఆటోమేటిక్‌గా చంద్రబాబు బలాన్ని కూడా తగ్గించినట్టు అవుతుందని జగన్ భావనగా అర్థమవుతోంది. అయితే, వైసీపీ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏర్పడిన ఆ గ్యాప్‌ను చిరంజీవితో భర్తీ చేయాలని జగన్‌ ఆలోచనగా చెబుతున్నారు. చిరంజీవి ఇప్పుడు మొత్తం సినిమాలపైనే ఫోకస్‌ పెట్టినా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో రాజకీయ దన్ను అవసరం. అలాగే రాజకీయాల్లో ఉన్న నాయకులకు... సినీ ఇండస్ట్రీ సహకారం, అందులోనూ మెగాస్టార్‌ లాంటి అగ్రతారల సపోర్ట్‌ కూడా అవసరం. అలా ఉభయులకూ ప్రయోజనం కలిగేలా... ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య అగాథాన్ని పూడ్చేలా, ఆ బాధ్యతను మీరే తీసుకోవాలని చిరంజీవిని జగన్‌ కోరినట్టు చెబుతున్నారు.

తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కీలకమైన అంశాలన్నింటిలో, అంటే ప్రత్యేక షోలు, ప్రత్యేక ధరలు, పన్నుల రాయితీలు ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో, ఏదైనాసరే చిరంజీవి సిఫార్సు ద్వారానే అనుమతించే అవకాశముందంటున్నారు. దాంతో తెలుగు సినిమా పరిశ్రమను మెగా ఫ్యామిలీ పూర్తిస్థాయిలో లీడ్ చేయబోతోందనే టాక్ వినబడుతోంది. మరి, చిరును ముందుపెట్టి... టాలీవుడ్ ను తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలనే జగన్ వ్యూహం ఫలిస్తుందో లేదో కాలమే తేలుస్తుంది. మొత్తానికి జగన్-చిరు మీటింగ్ తర్వాత టాలీవుడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.