వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను సీఎం జగన్ పరిశీలించారు. గురువారం ఉదయం 11 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్‌కు.. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్‌ కుమార్ యాదవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ లోపలికి వెళ్లి అక్కడి పనులను సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. వెలుగొండ నుంచి ఖరీఫ్ పంటలకు సాగునీరు అందిస్తామని జగన్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం అధికారులకు సూచించారు. మొదటి  టన్నెల్ పనులు ప్రారంభించి 15 సంవత్సరాలైంది. ఇప్పటికి 17 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. మరో 1.11 కిలోమీటర్ల తవ్వకాలు జరపాల్సి ఉంది. రెండవ టన్నెల్ పనులు 10.6 కిలో మీటర్ లు తవ్వకాలు పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది కిలోమీటర్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి. కాగా ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తే ఈ యేడాదిలోగా వెలుగొండ ప్రాజెక్టు నుంచి తాగు, సాగు నీరు అందుతాయని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికీ సీఎం జగన్ పర్యటనతోనైనా వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగం అందుకుంటాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.