సర్వత్ర ఉత్కంఠంగా మారిన కోర్టు తీర్పు... జగన్‌కు కోర్టు ఊరటనివ్వనుందా...

జగన్ అక్రమాస్తుల కేసులో నేడు కీలక పరిణామం ఎదురుకాబోతోంది. ఈడీ కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 10న వాదనలు పూర్తయ్యాయి.దీనికి సంబంధించిన తీర్పును ఇవాళ వెలువరించనున్న సందర్భంగా తీర్పు ఎలా ఉండబోతోందన్న అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జగన్ కు కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తుందా లేక హాజరు కావాలని చెబుతుందా అన్న దానిపై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఈడీ కేసు, సిబిఐ కేసులు రెండూ కలిపి ఒకే సారి విచారించాలన్న జగన్ పిటిషన్ ను కొట్టివేసిన సందర్భంగా నేటి తీర్పు పై అందరిలో ఉత్కంత్ఠ నెలకొంది.ఈ నెల 3న తన అక్రమాస్తుల కేసులో ఆప్షన్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా సిబిఐ కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గతేడాది మార్చి నుంచి ఒక్కసారి కూడా జగన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో కేసు దర్యాప్తులో పురోగతి ఎలా వుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.తదుపరి వాయిదాకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ముఖ్య మంత్రి హోదాలో జగన్ ఈ నెల 10న తన అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డితో కలిసి కోర్టుకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు జగన్ కోర్ట్ హాల్ లో ఉన్నారు. అనంతరం తన బదులు సహనిందితులు హాజరవుతారని పిటిషన్ దాఖలు చేశారు.తన హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మరో రెండు పిటిషన్ లు దాఖలు చేయగా అన్ని చార్జీ లు కలిపి విచారించడం ఒకటైతే, ఈడీ, సీబీఐ కేసులు రెండూ కలిపి ఒకే సారి విచారించటం మరొకటిగా ఉంది. ఈ రెండు పిటిషన్ లను కోర్టు గత వారమే కొట్టేసింది. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఈ నెల 10న దాఖలు చేసిన పిటిషన్ పై  తీర్పు రానుంది. ఒకవేళ కోర్టు తీర్పు జగన్ కు వ్యతిరేకంగా వస్తే ముఖ్య మంత్రి హోదా లో ఈడీ కేసులోనూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. జగన్ కు కోర్టు ఈడీ కేసులో ఐనా కొంత మేరా మినహాయింపు కలిగిస్తుందో లేదో వేచి చూడాలి.