నిరుపేదల భూమి కోసం ఏపీ సర్కార్ పాట్లు


 
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ అధికాకరంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉగాది నాటికి పాతిక లక్షల మందికి సెంటు చొప్పున ఇంటి స్థలాల పంపిణీ చేస్తామన్నది ప్రభుత్వ ప్రకటన. దీనికి సరిపడా ప్రభుత్వ స్థలాలు లేవు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. అందుకే గతంలో పేదలకు ఇతర వర్గాల వారికి ఇచ్చిన అసైన్డ్ భూములపైన ప్రభుత్వ కన్ను పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అసైన్డ్ భూములపై సేకరణ అస్త్రం ప్రయోగిస్తున్నారు. నిరుపేద, దళిత, బలహీన వర్గాల దగ్గర ఉన్న సాగు భూములు వెనక్కి లాక్కుంటున్నారు. అదేమిటీ అంటే పేదలకు ఇవ్వటానికే కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. లాక్కున్నా ఏమీ చేయలేరన్న ధీమాతో పేదలు, దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములపై కన్నేశారు.

అదేవిధంగా ఇన్నాళ్లు.. నమ్ముకున్న భూమిని వదులుకోవటానికి వారు ఏమాత్రం సిద్ధంగా లేరు. తమ భూముల్లోకి అడుగుపెట్టొదంటూ రెవిన్యూ అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఎసైన్డ్ పేద రైతుల ఆందోళనలలే. అధికారంలోకి వచ్చీ రాగానే ఈ పథకం కోసం భూమిని సిద్ధం చేయాలి అని రెవిన్యూశాఖను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఉన్న భూమి 17,000 ఎకరాలేనని ప్రైవేటుగా మరో 26,000 ఎకరాలకుపైగా సేకరించాల్సి ఉందని గత ఆగస్టులోనే ఆ శాఖ స్పష్టం చేసింది. అందుకు  కనీసం 16 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత 20 వేల ఎకరాలు సేకరిస్తే చాలని దీనికి పద్నాలుగు వేల కోట్ల వ్యయం కానుందని ఆర్థిక శాఖకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది. ఎంత ఖర్చయినా ఈ ప్రాజెక్టును పూర్తి చేద్దామని సర్కార్ గొప్పలు చెప్తుంటే ఖర్చుకు వెనకాడకుండా భూసేకరణ చేసి పేదలకు స్థలాలు ఇస్తారేమోనని అంతా అనుకున్నారు. అయితే అసలు కథ జనవరి నుంచే మొదలైంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా ప్రైవేటుగా చేపట్టే భూసేకరణను తగ్గించుకోవాలి అని వీలైనంత మేరకు ప్రభుత్వ భూములు గుర్తించి ఇంటి స్థలాలకు వాడుకోవాలి అంటూ సర్కార్ జనవరిలో సరికొత్తగా మార్గదర్శకాలు ఇచ్చింది.

అంతే భూసేకరణ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. కొత్తగా లిటిగేషన్ భూములు తెరమీదకొచ్చాయి. ఆ భూములపై కోర్టులలో అఫిడవిట్లు వెయ్యాలని ఈలోగా వాటిని ఇంటి స్థలాలకు వాడుకోవాలి అని మార్గదర్శకాలిచ్చారు. వీలైనంత మేరకు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న భూమిని వాడుకోవాలి అని పేర్కొన్నారు. అయితే అందులో బాగా విలువైన భూములు మాత్రం రిజర్వు చేశారు. వీటిని బిల్డ్ ఏపీ మిషన్ కింద అమ్ముకోవాలన్నది సర్కారు వ్యూహం. ఇప్పటికే జిల్లాల వారీగా వాటి జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న గ్రామీణ ప్రాంతాలలో 1,181 ఎకరాలు, పట్టణాల్లో 230 ఎకరాలు ఉన్నట్టు తేల్చారు. లిటిగేషన్ లో ఉన్న భూములు 1,076 ఎకరాలు ఈ రెండు కేటగిరీల్లో నికరంగా 3.5 లక్షల మందికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేని పరిస్థితి. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం వద్ద ఉన్న భూమి 20,000 ఎకరాలు. గ్రామీణ, పట్టణాల లోని 14 లక్షల మందికి కూడా సరిపోదు. ఇంకా ప్రైవేటుగా 9,619.22 ఎకరాలు సేకరించాల్సివుంది. మరిప్పుడు ఏవిధంగానైనా సరే భూమిని సేకరించి పేదనకు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. చూడాల మరి ఏం జరగనుందో.