సీఎం హోదాలో మొదటిసారి కోర్టు మెట్లెక్కిన వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఏ1 జగన్‌తో పాటు ఏ2 ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కోర్టుకు హాజరయ్యారు. సీఎం హోదాలో జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇదే తొలిసారి. గత ఏడాది మార్చి 1న చివరిసారిగా ఆయన కోర్టులో హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చారు. అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరుకావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి 3వ తేదీన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు ఏ1, ఏ2 లు జగన్, విజయ సాయి తప్పనిసరిగా హాజరుకావాలని, లేదంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జగన్, విజయసాయి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.