సీఎం వరాల జల్లులు.. ఏప్రిల్ లోపు 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు!!

209 వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలుగుతున్నామని సీఎం అన్నారు. రైతులకు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే వారికి , మత్స్యకారులకు.. చేనేతలకు.. అగ్రి గోల్డ్ బాధితులకు సుమారు 15 వేల కోట్లకు పైనే నగదు బదిలీ ద్వారా ఇచ్చినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చిరు వ్యాపారులు , తోపుడు బండ్ల వారికి 10 వేల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో రాష్ట్రం 12 వ ర్యాంక్ లో ఉందని గుర్తు చేశారు. మహిళలు , రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వారికి రుణాలు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని కోరారు. 

కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని ఎస్ఎల్బీసీ లెక్కలు చెబుతున్నాయని వారి కోసం ఒక చట్టాన్ని తీసుకువచ్చినట్లు సమావేశాల్లో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్యాంకర్లు ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేయాలని జగన్ స్పష్టం చేశారు. ఏప్రిల్ నాటికి దాదాపు 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశాల్లో వెల్లడించారు. వైఎస్ఆర్ నవోదయం క్రింద ఖాతాల పునః వ్యవస్థీకరణపై దృష్టి సారించాలని కోరారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మఒడి కింద ఈ నెలలో రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నట్లు సీఎం అన్నారు. నాడు- నేడు కింద 45 వేల స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలను బాగుచేస్తున్నామని దీనికి దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు పావలా వడ్డీ కింద పెట్టిన బకాయిలు రూ.648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారని ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నట్టు జగన్ తెలిపారు.