వైఎస్ పునరుద్ధరిస్తే... జగన్ రద్దు చేస్తాడా? తండ్రీకొడుకుల్లో ఎంత తేడా?

రాజ్యసభ మాదిరిగా శాసనమండలి కంపల్సరీ హౌస్ కాదు. పైగా కౌన్సిల్ కచ్చితంగా ఉండాల్సిదేనంటూ రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. శాసనమండలి అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఛాయిస్ మాత్రమే. సూచనలు, సలహాల కోసం రాష్ట్రం ఏర్పాటు చేసుకునే సభ. అయితే, రాజ్యసభ అలాంటి కాదు... ఏ ప్రభుత్వమైనా వద్దనుకున్నా రద్దు చేయడం సాధ్యంకాదు... ఎందుకంటే, రాజ్యసభకు చట్టబద్ధత ఉంది... దాన్నెవరూ రద్దు చేయలేరు. అయితే, శాసనమండలికి అలాంటి పరిస్థితి లేనేలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వద్దనుకుంటే మండలి రద్దును ఆపడం ఎవరి వల్లా కాదంటున్నారు. న్యాయపరంగా ముందుకెళ్లినా కౌన్సిన్ రద్దును అడ్డుకోలేరని చెబుతున్నారు. కేంద్రం కూడా అడ్డుచెప్పే అవకాశం ఉండదంటున్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం సహకరించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పొలిటీషియన్స్ చెబుతున్నారు.

అయితే, 1958లో ప్రారంభమైన ఏపీ శాసనమండలి... ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 1985లో రద్దు చేశారు. అప్పట్నుంచి 2007వరకు కౌన్సిల్ పునరుద్దరణకు ఏ ముఖ్యమంత్రీ ప్రయత్నించలేదు. అయితే, 2004లో ఆంధ్రప్రదేశ్ అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి... ఏళ్ల తరబడి పదవులకు దూరంగా ఉన్న కాంగ్రెస్ లీడర్ల కోసం మండలి పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటంతో... 2007లో పార్లమెంట్ ఆమోదంతో తిరిగి ఏపీలో కౌన్సిల్ ప్రారంభమైంది. అలా, 2007లో ప్రారంభమైన మండలి.... రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ వస్తోంది.

అయితే, ఇప్పుడు, ఎవరూ ఊహించనివిధంగా వైఎస్సార్ పునరుద్ధరించిన మండలిని రద్దుచేసే దిశగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తుండటం చర్చనీయాంశమైంది. తన తండ్రి ప్రారంభించిన అనేక పథకాలను తిరిగి కొనసాగిస్తున్న జగన్... వైఎస్ పునరుద్ధరించిన మండలిని మాత్రం ఉండాలో వద్దో తేల్చేస్తామంటూ మాట్లాడటంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తండ్రి పునరుద్ధరించిన దానిని కొడుకు రద్దు చేయబోతున్నాడా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి, మండలిని నిజంగానే రద్దు చేస్తారో? లేక కౌన్సిల్ లో టీడీపీని దారిలోకి తెచ్చుకోవడానికి వదిలిన అస్త్రమో చూడాలి.