కియా మోటార్స్‌ ఓపెనింగ్.. ఏ క్యా హై జగన్!!

 

అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియా మోటర్స్‌ ప్లాంట్‌ను జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. కియా మోటర్స్‌ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు కియా సంస్థ ను అభినందిస్తున్నా అని అన్నారు. రాష్ట్రంలో కియా మోటర్స్‌ చక్కగా పని చేస్తుందన్నారు. కియా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి.. పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇప్పటికే 3 వేల మంది పని చేస్తుండగా, అనుబంధ విభాగాల ద్వారా మరో 3500 మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. కియా మోటార్స్‌ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని జగన్ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇదిలా ఉంటే కియా మోటర్స్‌ ప్లాంట్‌ను జగన్ ప్రారంభించడం, కియా మోటర్స్‌ ని ప్రశంసించడంపై టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి ఆగస్టులో కియా కార్ లాంఛింగ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి రావాలని సీఎం జగన్‌ను కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. టీడీపీ హయాంలో.. చంద్రబాబు కియా పరిశ్రమను అనంతపురం తీసుకొచ్చారని.. బాబుకి క్రెడిట్ దక్కుతుందనే జగన్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదని అప్పుడు టీడీపీ నేతలు ఆరోపించారు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. కియా క్రెడిట్ బాబుకి ప్లస్ అవుతుందేమోనన్న భయంతో అప్పుడు కియా మీద విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కియా క్రెడిట్ కొట్టేయడానికి ఆరాట పడుతున్నారంటూ.. వైసీపీని టీడీపీ విమర్శిస్తోంది.

కియా మోటార్స్‌ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా.. వైసీపీ అధికార ట్విట్టర్ పేజ్ లో చేసిన ట్వీట్ పై కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 'మ‌హానేత వైయ‌స్ఆర్ కృషితో ఏపీలో కియాను ఏర్పాటు చేసిన ద‌క్షిణ కొరియా సంస్థ‌. రూ.13500 కోట్ల‌తో కియా కార్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటు.' అని వైసీపీ అధికార పేజ్ లో ట్వీట్ దర్శనమిచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. అసలు కియా బాబు వల్ల రాలేదు, ప్రధాని మోడీ వల్ల వచ్చిందని స్వయంగా జగనే వ్యాఖ్యానించారు. అప్పుడు మోడీ వల్ల వచ్చింది, ఇప్పుడు వైయ‌స్ఆర్ వల్ల వచ్చిందంటూ ఎన్ని మాటలు మారుస్తారు అని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. అసలు అప్పట్లో కియాని విమర్శించిన మీరు ఇప్పుడు కియా క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు విజయసాయి రెడ్డి వంటి నేతలు మాట్లాడిన మాటల్ని గుర్తుచేస్తున్నారు.

గతంలో విజయ సాయి.. బాబు కమీషన్లకు కక్కుర్తి పడి కియాకి రాయితీలు ఇచ్చారని అన్నారు. చైనాలోని అంత పెద్ద కియా మోటార్స్ ప్లాంటే మూత పడింది. ఇక అనంతపురం ప్లాంట్ సంగతి ఏంటో? అంటూ వెటకారం చేసారు. అప్పుడు అన్ని మాటలు  మాట్లాడిన మీరు ఇప్పుడు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారా అంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.