ఇంత కుట్రనా ? :- తెలుగు అంటే తూచ్.. ఇంగ్లీష్ అంటే భేష్.. అని జగన్ అందుకే అంటున్నాడు 

 

తెలుగు మీడియంను ఎత్తేయాలన్న ఏపి ప్రభుత్వ నిర్ణయం ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఓ భారీ సంస్కరణ చేసే ముందు కనీస కసరత్తు కూడా చేయకపోవడం వినాశనానికి దారి తీస్తుందని మేధావులు ఆందోళన చెందుతున్నారు. మాతృభాష అంతర్థానం అయిపోతుందని..అది తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అంతం అని పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంగ్లీష్ ప్రోత్సాహం వెనుక మత ఎజెండా ఉంది అని బీజేపీ అంటుంటే.. వీరందరిదీ రాజకీయ దురుద్దేశమేనని జగన్ తేల్చేస్తున్నారు. వచ్చే వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండనుంది. తెలుగు మీడియం ఉండదు. ఐదవ తరగతి వరకు తెలుగు మీడియం చదివినా కూడా ఆరో తరగతికి ఇంగ్లిష్ మీడియంకు తప్పక వెళ్లిపోవాలి.

ఇక ఒకటో తరగతిలో చేరే వారి ఇంట్లో అప్పటి వరకూ తల్లిదండ్రులు నేర్పిన అ, ఆ లు కాకుండా ఏ, బీ,సీ,డీ లతో ప్రారంభించాలి. అంటే ప్రభుత్వ బడుల్లో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈట్ ఇంగ్లీష్.. డ్రింక్ ఇంగ్లిష్.. స్లీప్ ఇంగ్లిష్.. అయిపోతుంది. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం పై ఒక్క సారిగా కలకలం రేగింది. దీనికి కారణం గత ప్రభుత్వం నగర పాలక పాఠశాల్లో ఇష్టపూర్వకంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాన్ని జగన్మోహనరెడ్డి మరియూ అతని మీడియా వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అదే సమయంలో భాషావేత్తలు, పెద్దలు, ఉపాధ్యాయ సంఘాలు తమ వ్యతిరేకతను సూటిగా స్పష్టంగా వ్యతిరేకించారు. తెలుగు అంటే భాష మాత్రమే కాదని సంస్కృతి సంప్రదాయాలని అలాంటి దాన్ని లేకుండా చేస్తే తెలుగు జాతి గుర్తింపు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా జగన్ నిర్ణయాన్ని ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలుగు మాతృ భాష అని, తెలుగును కాపాడుకోవాలని, తెలుగును పరిరక్షించుకోవాలని, మన ఉనికిని కాపాడుకోవాలని, ఇంగ్లిష్ నేర్చుకోవాలని, ఇది మన జీవనోపాధి అని, మన కెరియర్ కి సంబంధించిన విషయం అని చంద్రబాబు తెలిపారు.

భాషను కాపాడుకోలేకపోతే తెలుగు జాతి ఉనికి కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యతిరేఖతలన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ దురుద్దేశాలుగా తేల్చేశారు. పేదపిల్లల ఇంగ్లిష్ చదువులు చదువుకోకూడదా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారి పిల్లలూ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని సూటిగా అడిగేశారు. తెలుగు మీడియం లేకుండా చేయటాన్ని దాదాపుగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అదే కర్ణాటకలో..తమిళనాడులో.. మలయాళంలో ఆయా భాషల మీడియంను తొలగిస్తామని అక్కడి ప్రభుత్వాలు ప్రకటన చేస్తే ఏం జరుగుతుందో ఊహించలేమని.. అలాంటి ఆలోచనలు కూడా అక్కడి ప్రభుత్వాలూ చేయవని అంటున్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో భాషల్లోనే సంస్కృతి సంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా వారు తమ మాతృభాషను మరచిపోరు. తమ ఎదుగుదలకు ఇంగ్లీష్ అవసరమని నేర్చుకుంటారు కానీ తెలుగును మర్చిపోయేలా చేయాలనుకోరు.

కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రత్యేకంగా తెలుగు మీడియంను ఉంచాలని డిమాండ్ చేయటం రాజకీయ దురుద్దేశంగా పాలకులకు కనిపిస్తుంది. నిజానికి ఇలా తెలుగును చంపేసి ఇంగ్లిష్ ను మాత్రమే హైలేట్ చేయాలనుకోవడం వెనుక మతపరమైన కుట్ర ఉందన్న అభిప్రాయం వినిపిస్తున్నారు విపక్ష నేతలు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను గత ఐదు నెలలుగా చూస్తుంటే అందరికి అదే అనిపిస్తుందని.. అదే విషయాన్ని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బహిరంగంగా చెప్పారని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు.

ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.ఇంగ్లిష్ అనేది ఒక భాష మాత్రమే నేటి ప్రపంచంలో ఇంగ్లీష్ వస్తే అవకాశాలు ఎక్కువగా వస్తాయి నిజమే..అలాగని ఇంగ్లిష్ మీడియంలో  మాత్రమే చదివితే రావు. ప్రభుత్వ బడుల్లో మాతృభాషలో చదువుకున్న వారే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అనేక రంగాల్లో లీడర్ లుగా ఉన్నారు. వారికేమి మాతృభాషలో చదువుకోవడం అడ్డంకి కాలేదు. పైగా మాతృభాషలో చదువు ప్రారంభించటం వల్ల చదువుకు పునాది బలంగా పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వారు వెనుకబడి పోవడానికి ప్రధాన కారణం ఇంగ్లిష్ కాదు ఆయా స్కూళ్లలో విద్యా ప్రమాణాలు నాసిరకంగా ఉండడమే కారణం. ఆ విషయం ఎవరైనా చెబుతారు.

ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా అన్ని తరగతుల్లోనూ ఉంది. అలాంటప్పుడు విద్యార్థులకు ఇంగ్లిష్ విషయంలో ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యా ప్రమాణాలు పెంచితే తెలుగు మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్ పై పట్టు సాధించవచ్చని విద్యా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికి అది తెలియక కాదు కానీ ఓ ప్రత్యేకమైన ఎజెండా ప్రకారమే తెలుగు మీడియంను రద్దు చేస్తున్నారన్న అనుమానాలు అక్కడే వస్తున్నాయి.