నాలుగు పార్టీలు ఒకవైపు.. టీడీపీ ఒకవైపు

 

అటు తెలంగాణలో తెరాస,బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ పై విమర్శలు చేస్తుంటే ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్,జనసేన అధినేత పవన్,బీజేపీ నేతలు టీడీపీపై విమర్శలు చేస్తున్నారు.మొదటి నుంచి టీడీపీ నాయకులు జగన్,పవన్,బీజేపీ,తెరాస కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తున్నది తెలిసిందే.తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆ నాలుగు పార్టీలు ఒక్కటై టీడీపీ ని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు.

టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఓటర్ల నమోదు, కౌన్సిల్ ఎన్నికలు, బూత్ కన్వీనర్ల శిక్షణ, గ్రామ వికాసం పురోగతిపై చర్చించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం సృష్టించినా.. కేంద్రం నుంచి ఒక్క బీజేపీ నేత కూడా రాలేదని, ఎలాంటి సాయం అందించలేదన్నారు. రాజమహేంద్రవరంలో పవన్‌ కవాతును ప్రశంసించిన కేటీఆర్‌.. తిత్లీ తుపాను బాధితులపై కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవటం బాధాకరమన్నారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదని, ఆయన ఫ్యాక్షన్‌ మనస్తత్వమే దానికి కారణమన్నారు. జగన్‌ చిత్తశుద్ధితో పాదయాత్ర చేయట్లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మరో నాలుగేళ్లు ఆయన పాదయాత్ర చేసిన ఫలితం రాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.రాష్ట్ర ప్రజలు టీడీపీపై చూపుతున్న అభిమానాన్ని ఓర్వలేక నాలుగు పార్టీలు ఏకమై అక్కసు పెంచుకున్నాయని సీఎం ఆరోపించారు.బీజేపీ, వైసీపీ, తెరాస, జనసేన పార్టీలు టీడీపీనే టార్గెట్ చేస్తున్నాయని.. అదంతా మనకే లాభమని,వాళ్ళు తిట్టే తిట్లే మనకు ప్రజా దీవెనలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభిమానం తమపై ఉందని, అదే తమ నైతిక బలమని పేర్కొన్నారు.తాను ఒక్కడినే కష్టపడితే చాలదని,పార్టీ సభ్యులంతా కష్టించి పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.