ఏపీలో స్మార్ట్ గ్రిడ్ ఏర్పాటుకు చంద్రబాబు కృషి

 

ప్రస్తుతం జపాన్ దేశంలో పర్యటిస్తున్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థను నియంత్రించే అత్యాధునిక స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థను సందర్శించారు. ఈ స్మార్ట్ గ్రిడ్ విద్యుత్ సరఫరా, వినియోగంలో ఉండే తేడాలను తనంతట తానే నియంత్రించుకోవడమే కాకుండా, రాగల 24గంటలలో ఎంత అందనపు విద్యుత్ అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా ముందుగానే తెలియజేస్తుంటుంది. దాని వలన ముందుగానే అవసరమయిన విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకోవడమో లేక వినియోగం తగ్గించుకోవడం చేసే వీలు కలుగుతుంది. ఈ స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థ దేశంలో ఇతర విద్యుత్ గ్రిడ్లతో చక్కగా అనుసంధానం అవుతుంది. తద్వారా అవసరమయినప్పుడు ఇతర గ్రిడ్ల నుండి అదనపు విద్యుత్ స్వీకరించడం, మిగులు విద్యుత్ ఉన్నట్లయితే ఇతర గ్రిడ్లకు సరఫరా చేయడం వంటి పనులన్నీ తనంతట తానే చక్కబెట్టేసుకోగలదు. దీనికి ఇటువంటి అనేక ప్రత్యేకతలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇవ్వన్నీ చూసిన చంద్రబాబు నాయుడు ఆ స్మార్ట్ గ్రిడ్ ను నిర్మించి నిర్వహిస్తున్న ఫుజి ఎలెక్ట్రిక్ సంస్థను ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అటువంటి వ్యవస్థ ఏర్పాటుకు అవకాశం ఉందేమో చూసేందుకు రావలసిందిగా ఆహ్వానించారు. అందుకు ఆ సంస్థ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. వచ్చే నెలలో లేదా జనవరిలో గానీ ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.