కోర్టుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న బాబు

 

బాబ్లీ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు సహా 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గత నెలలో చంద్రబాబు తరపున ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ హాజరై కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసారు. కాగా ఈ కేసులో సీఎం అయినా, మరెవరైనా కోర్టుకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేస్తూ ధర్మాబాద్ కోర్టు కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.


అయితే తాజాగా అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులు, ముఖ్యనేతలు, అడ్వకేట్‌ జనరల్‌తో చంద్రబాబు తన నివాస ప్రాంగణంలోని ప్రజా వేదికలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐటీ దాడులు, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల తదితర అంశాలపై చర్చించారు. బాబ్లీ పోరాటంలో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్‌పై హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. ధర్మబాద్ కోర్టుకు భారీ ర్యాలీతో హజరైతే బాగుంటుందని చంద్రబాబుకి ఇప్పటికే కొందరు మంత్రులు సూచించారు. కోర్టుకు వెళ్లకుండా రీకాల్‌ పిటిషన్‌ వేయాలని పలువురు కోరారు. చిన్న కేసులకు సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు హాజరుకావాలని సీనియర్‌ మంత్రులు సూచించారు. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. చివరికి రీకాల్‌ పిటిషన్‌ వేసేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం.