రాజధాని గ్రామాల్లో పంటల దగ్ధం

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కానున్న తుళ్ళూరు గ్రామ పరిసరాల్లోని గ్రామాల్లో పలు పంటల్లో పంటను కాల్చేసిన ఘటన జరిగింది. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మండడం గ్రామాల్లో అరటి తోటలు, గడ్డివాములు, కూరగాయల తోటల పందిళ్ళకు గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో భారీగా పంట నష్టం జరిగింది. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ అంశం మీద ఆయన సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. పంటలు తగులబెట్టిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సందర్భంగా కలెక్టర్ను సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించనున్నారు.