రాజధాని పనుల్లో మళ్ళీ కదలిక ప్రారంభమైంది...

 

అమరావతి నిర్మాణంలో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ప్రాథమిక చర్చలు ముగిశాయి. కాసేపట్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో లాంఛనంగా ఆమోదం పొందిన తర్వాత నవంబర్ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టు సంస్థలకు వర్తమానం పంపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. అప్పటి వరకూ రాజధానిలో నిర్మాణాల కోసం కాంట్రాక్టు సంస్థలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముప్పై ఐదు వేల మంది కార్మికులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

నివాస భవనాలు, సెక్రెటరీ టవర్లు, హైకోర్టు నిర్మాణం, మంత్రుల నివాసాలు నిర్మాణ దశలో ఉన్నాయి. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది, ప్రస్తుతం ఈ విచారణ జరుగుతోంది. నివేదిక అందిన తర్వాత అక్రమాలు ఉన్నాయో లేవో తేలుతోంది. అయితే ఇటీవల ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిలో పర్యటించారు. అనేక నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన పర్యటన అనంతరం ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. రెండ్రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. మొత్తం పదమూడు పనులను నవంబర్ ఒకటవ తేదీ నుంచి పున ప్రారంభించాల్సిందిగా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.

ఈ పనులన్నీ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీవోలూ, గెజిటెడ్ అధికారులు, సచివాలయ ఉద్యోగుల అపార్ట్మెంట్ నిర్మాణాలను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన మూడు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పనుల పున: ప్రారంభానికి లిఖిత పూర్వకంగా లేఖలు పంపాలని కూడా నిర్ణయించారు. గతంలో రద్దు చేద్దామనుకున్న హై కోర్టు, సచివాలయ టవర్లు, మంత్రి నివాస భవనాలు, సీఎం నివాసాలను హొల్డ్ లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఎందుకంటే ఇప్పటికే ఈ భవనాల నిర్మాణం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పూర్తయింది. వీటిని రద్దు చేయటం మంచిది కాదని ఇంజనీరింగ్ నిపుణులు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెక్రటేరియట్, హెచ్ఓడి టవర్లు అంతస్తులు కుదించి పదిహేను లేదా ఇరవై అంతస్తులతో నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంతోంది. అయితే వ్యయం తగ్గదని భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టడం కూడా ఇబ్బంది అవుతుందని నిపుణులు సూచించినట్టు తెలుస్తుంది.