ఒకే రోజు రెండు సమావేశాలు.. ఏపీ సర్కార్ ఊహించని అడుగులు!!

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్.

ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.