అధికారులను అయోమయంలో పడేసిన క్యాబినెట్ భేటీ... మళ్లీ మారిన తేదీ!!

మూడు రాజధానుల నిర్ణయం అమలులో అతి కీలకమైన క్యాబినెట్ భేటీ పై ఉత్కంఠత మొదలైంది.తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్, మంత్రులు అధికారులతో కూడిన హైపవర్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీ ముగిసిన వెంటనే కేబినెట్ సమావేశాన్ని జరుపుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.18 వ తేదీ కేబినెట్ భేటీ 20 వ తేదీ అసెంబ్లీ నిర్వహిస్తామని గత నెలలోనే షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత క్యాబినెట్ అసెంబ్లీ రెండు సోమవారమే ఉంటాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఈ నిర్ణయం మారిపోయింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ భేటీ జరుగుతుందంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.రాజధాని పై హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రి మండలి ఆమోదించగా అసెంబ్లీలో చర్చించేలోగా న్యాయపరమైన ప్రతిబంధకాల పై అధ్యయనం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.కేబినెట్ వాయిదా పడినట్టు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సమాచారమిచ్చింది. 

తాజా సమాచారం ప్రకారం సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు క్యాబినెట్ భేటీ జరుగుతుంది. ఆ తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. క్యాబినెట్ సమావేశాన్ని సోమవారానికి మార్చడానికి పలు కారణాలున్నట్టు సమాచారం.రాజధాని మార్పుల్లో భాగంగా సీఆర్డీయేను రద్దు చేస్తూ బిల్లును ఆమోదించలని భావించారు. ఇది ద్రవ్య బిల్లు కాబట్టి అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికంటే ముందే గవర్నర్ ఆమోదం తీసుకోవాలని అందుకు అనుగుణంగా శనివారమే క్యాబినెట్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు.తర్వాత అది ద్రవ్య బిల్లు కాదని నేరుగా సోమవారం క్యాబినెట్ లో ఆమోదించిన వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్ట వచ్చుననే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమరావతి మార్పుపై ఇప్పటి దాకా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు, అందువల్ల కోర్టులు కూడా ఈ జోక్యం అంశం గురించి ప్రస్తావించట్లేదు.ఒకవేళ శనివారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న పక్షంలో వెంటనే దీని పై ఎవరైనా హైకోర్టును ఆశ్రయించవచ్చు. బిల్లు అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు,దీని కారణంగా కేబినెట్ భేటీ అసెంబ్లీ సమావేశం వెంట వెంటనే ఉండేలా ప్రణాళిక రచించినట్లు సమాచారం.