అమరావతిపై క్లారిటీ అడిగిన నేతపై వేటు వేసిన ఏపీ బీజేపీ

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. తాజాగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి అయన దూకుడు మరింత పెంచారు. హైకమాండ్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో వాటిని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలని లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇందులో ఎటువంటి మొహమాటం ఉండదని అయన స్పష్టం చేస్తున్నారు.

 

తాజాగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం విషయంలో మొదటి నుండి అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని దానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని ఐతే పార్టీపరంగా మాత్రం మేము అమరావతికి మద్దతు తెలుపుతామని సోము వీర్రాజు చెప్పడం తెలిసిందే. ఈ విషయం ఇలా ఉండగానే ఏపీ రాజధాని అంశంపై బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓ వి రమణ "మూడుముక్కలాట తో నష్టపోతున్న బీజేపీ" అంటూ ఇటీవల ఓ ప్రముఖ తెలుగు దిన పత్రికలో వ్యాసం రాశారు. దీంతో ఆగ్రహించిన సోము వీర్రాజు ఆ వ్యాసం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటించి ఓవీ రమణ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు

 

ఐతే ఆ వ్యాసంలో డాక్టర్ రమణ రాసింది ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు గా ఉన్న సమయం వరకు అమరావతి రాజధాని కి బీజేపీ అనుకూలంగా ఉందని దీక్షలు చేశారు మీడియా సమావేశాలు పెట్టి భారీ డైలాగులు వేశారు. అయితే అధ్యక్షుడు మారిపోగానే.. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, అదే సమయంలో పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరని కొత్తగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రజల తరుఫున పోరాడతామని కొత్త అధ్యక్షులు చెపుతున్నారని పేర్కొన్నారు. దీంతో రాజధాని పై స్పష్టత లేని బీజేపీ పైన ప్రజలలో ఉన్న నమ్మకం పూర్తిగా పోతోందని దానితో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా అయోమయం లో పడ్డారని అందులో పేర్కొన్నారు. తాజాగా ఆ ప్రాంత రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినప్పుడు, మరి రాష్ట్ర బీజేపీ మద్దతు దేనికి ఇస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడిన బీజేపీ ని ప్రజలు శంకించే పరిస్థితి ఏర్పడిందని ఓ వి రమణ ఆ వ్యాసంలో ఏపీ బీజేపీని సూటిగా ప్రశ్నించారు. దీంతో సోము వీర్రాజు వెంటనే రమణ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.