వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదు.. సైకో పార్టీ



ఏపీ నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాల్లో వాయిదాల పర్వం సాగుతోంది. సభ ప్రారంభమైన వెంటేనే వైసీపీ పార్టీ నేతలు నిత్యవసర వస్తువుల ధరలపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఇచ్చారు. అయితే స్పీకర్ దానిని తిరస్కరించడంతో వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనలు చేశారు. స్పీకర్ ఆందోళనలు విరమించాలని.. ప్లకార్డులు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని చెప్పారు. మరోవైపు విపక్షనేతలు టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా సభను సజావుగా సాగనివ్వాలని కోరినా వినకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

 

వాయిదా అనంతరం టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సభలో వైఎస్సార్ పార్టీ తీరుపై మండిపడ్డారు. సభను పదే పదే అడ్డుకోవడం వైసీపీ నేతలకు తగదని.. 'వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తీసేసి సైకో పార్టీ'గా పెట్టుకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దీంతో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు మళ్లీ సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. స్పీకర్ వారిని ఎంతో వారించిన వినకపోవడంతో మళ్లీ సభను 10 నిమిషాలపాటు వాయుదా వేశారు.