ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు... అమరావతిలో పెరుగుతున్న హీట్...


 

ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో అమరావతిలో హీట్ కూడా పెరుగుతోంది. రాజధానిలోని 29 గ్రామాల పరిధిలో రైతులు, మహిళలు ప్రతీ రోజూ ఏదో ఒక రూపంలో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులకూ, ఆందోళనకారులకూ మధ్య నిత్యం వాగ్వాదాలు, దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా వీటిని సీరియస్ గా తీసుకోకపోవడంతో అమరావతి గ్రామాలు ఆందోళనలతో అట్టుడుకుతూనే ఉన్నాయి. 

శాసనమండలి రద్దు ప్రతిపాదనల నేపథ్యంలో ఏపీ రాజధాని తరలింపు వ్యవహారం పార్లమెంటుతో పాటు న్యాయస్ధానాల పరిధిలోకి వెళ్లిపోయింది. దీంతో ఏపీ ప్రభుత్వం వీటితో సంబంధం లేకుండా బడ్డెట సమవేశాలు ముగియానే విశాఖకు రాజదాని తరలింపు కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. రాజధానిలో ఏర్పాటు చేసే ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్ధలాల కోసం ఇప్పటికే విశాఖలో అధికారులు అణువణువూ గాలిస్తున్నారు. తొలుత రుషికొండలోని మిలీనియం టవర్స్ ను సచివాలయం ఏర్పాటు కోసం పరిశీలించిన ప్రభుత్వం... తాజాగా ఆ ప్రతిపాదనను విరమించుకుంది. దీంతో సచివాలయంతో పాటు, సీఎం క్యాంపు కార్యాలయం, ఇతర హెచ్.ఒ.డి కార్యాలయాల కోసం స్ధలాల అన్వేషణ కొనసాగుతోంది. 

మరోవైపు బడ్జెట్ సమావేశాలు ముగిశాక రాజధాని తరలిపోవడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో అమరావతిలో రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. నిత్యం రాజధాని గ్రామాల్లో ఏదో ఒక రూపంలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో అధికార వైసీపీ నేతలపై దాడులకు కూడా పాల్పడే పరిస్ధితి ఉంది. వాటిని ప్రతిఘటించే క్రమంలో వైసీపీ నేతలు కూడా రాజధాని రైతులను, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో పోలీసులు కూడా జోక్యం చేసుకుని తీవ్ర చర్యలు తీసుకునే పరిస్ధితి  లేదు. దీంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకూ ఆందోళనలు విరమించబోమని చెబుతున్న అమరావతి రైతులు.. అధికార వైసీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ తమ డిమాండ్లను వారిముందు పెడుతున్నారు. 

రాజధాని రైతులతో ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు సమావేశమై వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ రాజధాని తరలింపు తప్ప తమకు ఇంకేమీ వద్దనేది వారి నుంచ వినిపిస్తున్న మాట. దీంతో ప్రభుత్వం కూడా ఆందోళనలను శాంతిపజేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తొలుత రైతులు శాంతించాలని ప్రకటనలు చేసిన మంత్రులు.. ఆ తర్వాత మౌనం వహించారు. కానీ వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమవుతున్న తరుణంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న అమరావతి గ్రామాల్లో మంత్రులు, ఎంపీలను వారు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి పరిస్ధితి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈసారి బడ్జెట్ సమావేశాలను మొక్కుబడిగా పూర్తి చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శాంతి భద్రతల పరిస్ధితిని సాకుగా చూపుతూ బడ్జెట్ సమావేశాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తారని భావిస్తున్నారు.