మరో ఆర్టీసీ కండక్టర్ మృతి... మనస్తాపానికి గురై మతి చెలించి చివరకు ప్రాణాలు వీడారు

 

ఆర్టిసి సమ్మె ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో మరో కార్మికుడు తీవ్ర మనస్థాపంతో మృతి చెందాడు. ధర్నాలు, దీక్షలతో ఏమీ ఒరగదని... ప్రభుత్వం దిగి రావాలంటే తెలంగాణ ఉద్యమంలో జరిగినట్లుగా బలిదానం చేసుకోవాల్సిందేనని నమ్మిన కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు మతిస్థిమితం కోల్పోయి చివరకు చనిపోతున్నారు. ఆర్టీసీ కుటుంబాలకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని ఆర్టిసిలో చివరి బలిదానం తనదే కావాలని పేర్కొంటూ బలవంతంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్ మానసిక ఆందోళనతో మృతి చెందాడు. తనను మళ్లీ కొలువులోకి తీసుకుంటారో లేదోనని ఆందోళన చెందాడు.. ముందే సీఎం కేసీఆర్ పుట్టిన డెడ్ లైన్ కూడా ముగిసింది. కొలువులోకి తీసుకోకుంటే ఇల్లు గడిచేదెలా.. ఆర్టీసీ కండక్టర్ అస్తమానం ఇవే ఆలోచన్లతో నలిగిపోయాడు. తిండి,నిద్ర కూడా మరచిపోయి ఇదే చింతలో ఉన్న ఆయన ఈ నెల 6న  మతిస్థిమితం కోల్పోయాడు. ఆఖరికి ఇప్పుడు ప్రాణాలే కోల్పోయాడు.

ఆర్టిసి సమ్మెలో భాగంగా ప్రతి రోజూ సంగారెడ్డి డిపో వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని నిర్ణయించిన డెడ్ లైన్ ను టీవీలో చూసినప్పట్నుంచి నగేష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో అతని భార్య సుజాత తన తల్లి నివాసముండే జోగిపేటకు భర్తతో కలిసి వచ్చింది. మూడు నాలుగు రోజుల నుంచి నగేష్  టికెట్ టికెట్, బస్ ఆగింది దిగండి, రైట్ రైట్ అంటూ అరవడం ఆ సందర్భం గానే నవ్వుతూ ఉండటం.. ఫోన్ రాకున్నా హలో హలో అనడం.. ఎవరు చేశారని అడిగితే అశ్వద్ధామ అని సమాధానమిస్తూ ఉండేవాడు. ఒక్కోసారి ఉండండి డిపోలో కలెక్షన్ కట్టి వస్తానంటూ అరవటం ఇక ఇదే ధ్యాసలో ఉన్న నగేష్ చివరికి చనిపోయాడు. తన పిల్లల్ని కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఆయన మృతి చెందాడు. ఇలాగే నగేష్ రాత్రంతా నిద్రపోకుండా ఏదోకటి మాట్లాడుతూ ఉండడంతో భర్త ప్రవర్తన చూసి సుజాత కంటి నిండా నీరుతో జాగారం చేస్తూ ఉండేది. చేతిలో డబ్బులు లేవని తన భర్తకు చికిత్స అందించేందుకు దాతలు ముందుకు రావాలని సుజాత వేడుకునేది. ఆర్టీసీ ఆసుపత్రికి వెళ్తే సమ్మెలో ఉన్న వారికి చికిత్స చేయమంటూ వెళ్లగొట్టారని బాధపడింది. ఇన్ని కష్టాల నడుమ ఏదోలా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా చివరకు నగేష్ చనిపోవడం పై తన ఆవేదనను సుజాతా వ్యక్తం చేసింది.